పోలీసుల త్యాగాలు మరువలేనివి: మంత్రి నారాయణ
నెల్లూరు,మే5(జనం సాక్షి ): పోలీసుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని వెంకటగిరి 9వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్ల పాసింగ్‌ఔట్ పరేడ్ జరిగింది. ఈ సందర్బంగా శిక్షణ పూర్తిచేసుకున్న 262 మంది కానిస్టేబుళ్ల నుంచి మంత్రి నారాయణ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ… పోలీసులు సమాజానికి కంచె లాంటివారు, బోర్డర్‌లో సైనికులు, సమాజంలో పోలీసులు నిరంతరం పోరాడుతూనే ఉంటారన్నారు. అలాగే రాష్ట్రంలో 20వేల మంది పోలీసుల కొరత ఉందని, ప్రభుత్వం కొత్తగా 6వేల మంది పోలీసుల నియామకాన్ని చేపట్టిందని ఆయన అన్నారు. మనం శాంతియుతంగా జీవించడానికి పోలీసులు చేస్తున్న త్యాగాలు మరువలేనివని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో 20వేల మంది పోలీసుల కొరత ఉంది అందుకే, ప్రభుత్వం కొత్తగా 6000 మంది పోలీసుల నియామకాన్ని చేపట్టిందన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు వృత్తిలో మరింత రాణించడానికి టెక్నాలజీని చక్కగా వాడుకోవాలని అన్నారు.