ప్రజలకు ఇచ్చిన మాట తప్పను
విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన హామీల అమలుపై 12 విభాగాల అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ‘ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని తపిస్తున్నాను. ఇందుకు మీరు సహకరించాలి. జిల్లాల్లో పర్యటించే ముందే గతంలో ఇచ్చిన హామీలు అమలుకావాలి. మీకెంత సమయం కావాలో చెప్పండి. సమస్యలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. 926 హామీల్లో 283 హామీలు అమలుచేయగా 628 పరిష్కార దశలో ఉన్నాయని, మరో 15 హామీల అమలుకు చొరవ తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నిధుల సమస్య లేదని తెలిపారు. నిధుల సమస్య ఎక్కడుందో అక్కడ కన్వర్జెన్స్‌తో పనులు చేపడుతున్నామని, నాబార్డు లాంటి సంస్థలతో ఇబ్బందులు వస్తే తనకు చెప్పాలని చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి మంజూరు చేశారుకానీ నిధులు విడుదల కాలేదంటే అది విమర్శో, ప్రశంసో అర్థంకాని స్థితి అవుతుందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తిచేయాలని, సమస్యలు వస్తే సమన్వయంతో పనిచేయాలని కోరారు. పైస్థాయి అధికారులతో మాట్లాడి పనిచేయాలని చంద్రబాబు సూచించారు.