ప్రజల ఆదరణ పెరుగుతోంది : జివి
గుంటూరు,సెప్టెంబర్13(జనంసాక్షి): విభజన సమయంలో రాజధాని లేక లోటు బ్జడెట్‌లో ఉన్న రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా గత మూడున్నరేళ్ళలో సమర్థ పాలనను తెలుగుదేశం ప్రభుత్వం అందించిందని జిల్లా టిడిపి అధ్యక్షులు జివి ఆంజనేయులు అన్నారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ద్వారా చేసిన పనులను,చేయబోయే పనులను చెప్పి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. ప్రభుత్వ పథకాల్ని సద్వినియోగం చేసుకుని మహిళలు,బడుగు వర్గాలు ఉపాధి సాధించాలని కోరారు. మహిళల కోసం అనేక పథకాలు అమల్లో ఉన్నాయని, డ్వాక్రాలను అభివృద్ది చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. వాటిని సద్వినియోగం
చేసుకోవాలన్నారు. పొదుపు సంఘాల్లోని సభ్యులు ఆర్థిక క్రమశిక్షణతోపాటు పిల్లల చదువులపట్ల శ్రద్ధ చూపించాలన్నారు. చంద్రన్న బీమా పథకం భరోసా కల్పిస్తోందని అన్నారు. విపక్ష వైకాపా అభివృద్ధికి సహకరించకపోగా ప్రతిపనికీ అడ్డు తగిలేలా వ్యహరించడం సరికాదన్నారు. రానున్న శాసనసభ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించిన తక్కువ కాలంలోనే అధికారంలోకి తెచ్చారని,పేదల అభ్యున్నతే ధ్యేయంగా పార్టీ స్థాపించిన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనసాగిస్తూ ప్రజాదచరణ పొందుతున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో పార్టీ బలంగా ఉండే విజయం ఖాయమన్నారు. మూడేళ్లలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని కోరారు. రాష్టాన్రికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని.. దాంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.