ప్రజల ఆస్తులను లాక్కోం.
మంగళగిరి రూరల్: ప్రజలు, రైతుల ఆస్తులను లాక్కోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ తెలిపారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో సోమవారం మంత్రులు గ్రామకంఠాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. మంత్రి పుల్లారావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి 29 గ్రామాలోని రైతులు, ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన విధి విధానాలపై పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. గ్రామకంఠాల గుర్తింపు విషయంలో కొంత గందరగోళం నెలకొన్న మాట వాస్తవమేనన్నారు. 9.5 ఫారంలో గ్రామకంఠాల గుర్తింపు విషయంలో రైతులు, ప్రజలకు ల్యాండ్ పూలింగ్‌లో కలుపుకుంటారనే ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. వారం రోజుల్లో రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులతో కలిసి రీసర్వే చేయిస్తామని తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ గతంలో చెప్పిన విధంగానే డిసెంబరు 8, 2014 నాటికి గ్రామకంఠాల్లో ఉన్న ఇళ్లకు ఎలాంటి భయం ఉండదని చెప్పారు. ప్రతిరోజు రెండు, మూడు గ్రామాలను పర్యటిస్తూ గ్రామకంఠాల గుర్తింపుపై ప్రజల అనుమానాలను నివృత్తి చేస్తామని తెలిపారు. వచ్చే శనివారం లోపు సంబంధిత గ్రామాల సీఆర్‌డీఏ కార్యాలయాల్లో ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పవన్‌కల్యాణ్ భూ సమీకరణలో భూములిస్తే తీసుకోమని చెప్పారని, పవన్ చెప్పిందే మేము ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నామని అన్నారు. ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్‌కు కట్టుబడి ఉందన్నారు. అంతుకు మందు ఎన్నో ఏళ్లుగా నివాసం ఉన్న తమ ఇళ్లకు నోటీసులు ఇస్తున్నారని గ్రామస్తులు మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం గ్రామకంఠాల విషయంలో ఆందోళనకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మంగళగిరి మునిసిపల్ చైర్మన్, నియోజకవర్గ ఇన్‌చార్జి గంజి చిరంజీవి, వైస్‌చైర్మన్ బాలాజీగుప్తా, జేసీ శ్రీధర్, జడ్పీటీసీ ఆకుల జయసత్య తదితరులు పాల్గొన్నారు