ప్రజా సంక్షేమం పట్టని విపక్షనేత :ఎమ్మెల్సీ
నంద్యాల,అక్టోబర్28(జనంసాక్షి): జగన్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పాదయాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిద్దపడ్డారని ఎమ్మెల్సీ ఫరూక్ విమర్శించారు. చట్టసభలకు హాజరు కాకూడదన్న నిర్ణయం వల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారో చెప్పాలని శనివారం నాడిక్కడ అన్నారు. ప్రజాసంక్షేమానికి ప్రభుత్వం తపిస్తుంటే ప్రతిపక్షనేత జగన్ అబద్ధాల మాటలు చెబుతూ వారిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. అందుకే నంద్యాల ప్రజలు విజ్ఞత కలిగిన వారని, జగన్ మొసలి కన్నీళ్లను నమ్మరని రుజువు చేశారని చెప్పారు. నంద్యాలలో ఓటమి చెందినా మార్పు రాకపోవడంతో అసెంబ్లీ బహిష్కరణకు పిలుపునిచ్చారని అన్నారు. ఆందోళనతోనే సంయమనం కోల్పోయి మతిలేని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. అన్నదాతల కుటుంబాల్లో ఆనందం చూడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లోని చెరువుల్లో సాగు, తాగునీటిని నింపేందుకు ప్రభుత్వం తీసుకుఎన్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. నీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. రేపటి భవిష్యత్తు కోసం ప్రజలు పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.