ప్రతీకారం తీర్చుకుంటాం


9999ఏవోబీ హత్యాకాండ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర
చంద్రబాబు, ఆయన కుమారుడితో పాటు ఉప్పందిస్తున్న మాజీలనూ వదలం
మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ పేరిట లేఖ విడుదల
 విశాఖపట్నం: ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో అగ్రశ్రేణి నాయకులతో సహా 28 మందిని ఎన్‌కౌంటర్‌లో చంపామని చెబుతున్న ప్రభుత్వం, పోలీసుల మాటలు పచ్చిబూటకమని సీపీఐ మావోయిస్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ ఆరోపించింది. చంద్రబాబు కేంద్రంతో కలిసి పన్నిన కుట్రే ఏవోబీ హత్యాకాండ అని పేర్కొన్నారు. కమిటీ ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్‌ పేరిట ఈ లేఖ విడుదలైంది. మావోలు సమావేశమైన సంగతి ముందుగా తెలుసుకున్నారని, కోవర్టు పద్ధతిలో వారికి అందే ఆహార పదార్థాల్లో మత్తు, విష పదార్థాలు కలిపారని వివరించారు. రాత్రి భోజనం తర్వాత వాళ్లు మత్తులో పడిపోతే చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపి కిరాతకంగా హత్య చేశారని ఆరోపించారు. కాల్పుల్లో గాయపడిన వారిని మరో ప్రదేశంలో దాచి చిత్రహింసలకు గురి చేసి వారిలో నలుగురిని మంగళవారం కాల్చి చంపారని పేర్కొన్నారు. నక్సలైట్లను చంపే క్రమంలో ప్రమాదవశాత్తు నీళ్లలో జారిపడిన పోలీసు అబూబకర్‌ మరణాన్ని ఎన్‌కౌంటర్‌ మృతిగా చిత్రీకరించి ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆరు వేల మంది పోలీసు, పారా మిలటరీని దించి ఆదివాసీ గిరిజనులను అల్లకల్లోలం చేయడం ఆపాలన్నారు. గాయాలతో పోలీసుల అధీనంలో ఉన్న మావోయిస్టులను వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. హక్కుల కోసం గొంతెత్తిన ప్రజలను హతమారుస్తుంటే పోలీసైనా.. మిలటరీ అయినా ప్రతిఘటన తప్పదని తెలిపారు. ప్రకృతి ఇచ్చిన సంపదను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నంలో ప్రభుత్వాలు దేశాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు.

అవసరమైతే ఆత్మాహుతి దాడి చేస్తాం
ఏవోబీ దారుణ హత్యాకాండ… కోవర్టుల హత్యల సృష్టికర్త చంద్రబాబునాయుడు అని లేఖలో ఆరోపించారు. నయీంను మానవ రూపంలో ఉన్న రాక్షసుడిగా తయారు చేసి 15 ఏళ్లపాటు వందలాది హత్యలు చేయించిన ఘనత ఆయనదేనన్నారు. గతంలో అలిపిరిలో తప్పించుకున్నా…. ఈ సారి చంద్రబాబు, ఆయన కొడుకు తప్పించుకోలేరని, అవసరమైతే ఆత్మాహుతి దాడి చేస్తామని ఆ లేఖలో హెచ్చరించారు. డబ్బు కోసం, విలాసాల కోసం ప్రభుత్వంతో, పోలీసులతో చేతులు కలిపిన మాజీలను మానవతా దృక్పథంతో వదిలిన ఫలితంగానే పార్టీ నాయకత్వాన్ని కోల్పోవాల్సి వచ్చిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. పార్టీ ద్రోహులైన మాజీల సంగతి త్వరలోనే ముగిస్తామని హెచ్చరించారు. ఇలాంటి ద్రోహుల చిట్టా తయారీకి పార్టీ జిల్లాల వారీగా ఆదేశించిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విడుదలైన ఈ లేఖ వాట్సప్‌, ప్రసార మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. మావోయిస్టు పార్టీ పేరిట విడుదలైన లేఖ వాళ్లు విడుదల చేసింది కాదని, ఆ పార్టీ పేరిట అనుబంధ సంఘాలే దీన్ని విడుదల చేశాయని నిఘావర్గాలు భావిస్తున్నాయి.


లేఖ ఓ.. ఎత్తుగడ: విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి శ్యామ్‌ పేరు మీద విడుదల చేసిన ప్రకటన పూర్తిగా ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ సృష్టి అని విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ ఆరోపించారు. ఒడిశాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో గాయపడిన, సమీప ప్రాంతాల్లో తలదాచుకున్న మావోయిస్టులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా చేయడానికి వేసిన ఎత్తుగడ అని వివరించారు. మావోయిస్టు పార్టీ పంథాకు వ్యతిరేకంగా ఆత్మాహుతి దాడులు చేస్తామని, కుటుంబ సభ్యులు లక్ష్యంగా చేసుకుంటామని కొత్తమాటలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా ఫ్రంట్‌ ఆర్గనైజేషన్లు చేస్తున్న ప్రకటనలను ఆయన ఖండించారు. ఎదురుకాల్పుల్లో గాయపడిన, సమీప ప్రాంతాల్లో దాక్కున్న మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ఎలాంటి హాని ఉండదని, వైద్యం చేయించి చట్టానికి అప్పచెప్పుతామని వివరించారు. వీరిని లొంగిపోవాలని పిలుపు ఇవ్వాలని సూచించారు. మావోయిస్టుల ఫ్రంట్‌ ఆర్గనైజేషన్ల వారిని, విలేకర్లను తీసుకుని కూంబింగ్‌ జరుగుతున్న ప్రాంతంలో లొంగిపోయే మావోయిస్టుల కోసం ఎన్నిరోజులైనా వేచి ఉండడానికి పోలీసులు సిద్ధంగా ఉంటారని తెలిపారు.

తాజావార్తలు