ప్రధానులనూ విచారించి . చంద్రబాబును వదిలేస్తారా
– చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్‌సన్ సుప్రీంకోర్టులో చెప్పారు
– కేసుల భయంతోనే విజయవాడకు పారిపోయిన చంద్రబాబు
– వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి
విజయవాడ, మే9(జనం సాక్షి) : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధి కోరారు. బుధవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ఓటు కొనేందుకు రూ.50లక్షలు చంద్రబాబు ఇప్పించారని, ఆపై ఆడియో టేపుల్లో వాయిస్ ఆయనదేనని తేలిందన్నారు. చంద్రబాబు రాజకీయాలను చూసిన తర్వాత ప్రజలకు రాజ్యాంగంపై నమ్మకం పోయిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేయలేవనే ధీమాతో టీడీపీ నేతలున్నారని, రాజ్యాంగాన్ని ఖూనీ చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పార్ధసారధి కోరారు. ఓటుకునోటు కేసులో సీబీఐ లేదా ఉన్నత స్థాయి సంస్థతో విచారణ జరపాలన్నారు. ఓటుకునోటు కేసు రెండు రాష్ట్రాల సమస్య కాదని, కానీ ఈ కేసు కారణంగా ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరకడం వల్లే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మోకరిల్లి హైదరాబాద్‌ను వదిలిపెట్టి విజయవాడకు పారిపోయి వచ్చారని గుర్తుచేశారు. కేవలం ఈ కేసు భయంతోనే పదేళ్ల రాజధాని హైదరాబాద్‌ను చంద్రబాబు వదులుకున్నారని తెలిపారు. 5కోట్ల మంది ఆంధ్రుల హక్కును చంద్రబాబు తాకట్టు పెట్టారని, అనవసరమైన ఆర్థిక భారాన్ని ప్రజలపై ఏపీ సీఎం వేశారని విమర్శించారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను కూడా చంద్రబాబు అడ్డుకోలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానులుగా ఉన్నవారిపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా విచారణ చేశారని, అలాంటిది సీఎం చంద్రబాబుపై ఎందుకు విచారణ చేయట్లేదదని ప్రశ్నించారు. కోర్టు చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని స్టీఫెన్‌సన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీబీఐ కేసులు పెట్టి తనను అరెస్ట్ చేస్తుందనే భయంతోనే నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీకి చంద్రబాబు ఊడిగం చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగం అంటే చంద్రబాబుకు పిచ్చిరాతగా ఉందని, ఇతర పార్టీ ఎమ్మెల్యేలను అధికారంలో ఉన్న చంద్రబాబు కొన్నారని, ఎందుకంటే ఈ రాజ్యాంగం తనను ఏం చేయలేదని ఏపీ సీఎం భావిస్తున్నారని పార్ధసారధి అన్నారు.