ప్రభుత్వపరంగా సాయం అందించేందుకు కృషి చేస్తా

– పొలాల్లో ఇసుక మేటలపై సర్వే చేయాలని కలెక్టర్‌ను కోరుతాం
– పంటలు ఎండిపోకుండా విద్యుత్‌ పునరుద్దరించాలి
– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
జనంసాక్షి, మంథని : ప్రకృతి ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం ఆదుకునే ఆలోచనలో ఉందని, రైతులు, ప్రజలు అధైర్యపడవద్దని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జీ పుట్ట మధూకర్‌ భరోసా ఇచ్చారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో మానేరునది ఉప్పొంగి వరద ముంపుకు గురైన మంథని మండలం అడవిసోమన్‌పల్లి, నాగేపల్లి, చిన్న ఓదాల గ్రామాల్లో ఆయన పర్యటించి వరదలో మునిగిపోయిన పంటపొలాలను, గృహాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నడూ ఊహించని రీతిలో ఈసారి బారీ వర్షాలు కురిశాయని, కరీంనగర్‌, వరంగల్‌ లాంటి పట్టణాలను వరద నీరు ముంచెత్తిందని ఆయన తెలిపారు. భూపాలపల్లిజిల్లాలోని మోరంచవాగు ఉప్పొంగి ప్రవహించడంతోనే ఈ ప్రాంతానికి వరద తాకిడికి గురై కొంత నష్టం జరిగిందని ఆయన వివరించారు. పంట పొలాలను వరదలు ముంచెత్తి ఇసుక మేటలు వేశాయో ఆ ప్రాంతాల్లో సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఇప్పటికే పంట పొలాలను వరదలు ముంచెత్తి నష్టం చేశాయని, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడిందని, వరదలో మునిగిపోకుండా ఉన్న పంటలు ఎండిపోకుండా విద్యుత్‌ సరఫరాను వెంటనే పునరుద్దరించాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. వరదలో ఇబ్బందులు పడ్డ రైతులు, ప్రజలను ఆదుకునే విధంగా తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారని, ఈ క్రమంలో మంత్రులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఈ ప్రాంతంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా చూశామన్నారు. వరద ముంపుతో నష్టపోయిన వారికి ప్రభుత్వపరంగా సాయం అందించేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు.

తాజావార్తలు