ప్రముఖ హేతువాది గోపరాజు లవణం కన్నుమూత

విజయవాడ ఆగస్టు 14 : ప్రముఖ హేతువాది, సంఘసేవకుడు గోపరాజు లవణం(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన విజయవాడలోని రమేష్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 9:56 గంటలకు తుదిశ్వాస విడిచారు. సంఘం, ది ఎథిస్ట్‌, నాస్తిక మార్గం పత్రికలు లవణం సంపాదకీయంలో వెలువడ్డాయి. భారత నాస్తిక కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు. చిన్నతనంలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1973లో విజయవాడ హేతువాద సంఘ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
అప్పృశ్యత, కుల నిర్మూలన కోసం తీవ్రంగా కృషి చేశారు. గుర్రం జాషువా కుమార్తె హేమలతను లవణం వివాహం చేసుకున్నారు. హేమలత కూడా మూఢనమ్మకాలపై పోరాటం చేశారు. సంస్కార్‌ సంస్థ ద్వారా జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. గాంధేయ విలువలకు కట్టుబడి సామాజిక అభ్యున్నతికి అంకితమై పనిచేస్తున్నందుకు లవణంకు ‘జమునా లాల్‌బజాజ్‌’ అవార్డు లభించింది.
సామాజిక జాగృతికి అనేక విధాలుగా కృషి చేస్తున్న లవణం హేతువాదం, నాస్తికవాదంపై అనేక గ్రంథాలను రచించారు. సమాజంలో వేళ్లూనుకున్న మూఢ విశ్వాసాలు, మతమౌఢ్యానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలను నడిపారు. నాస్తికోద్యమ నిర్మాత గోరా తొమ్మిది సంతానం కాగా లవణం రెండో కుమారుడు.

మరికాసేపట్లో లవణం మృతదేహాన్ని బెంచిసర్కిల్‌లోని నాస్తిక్‌ కేంద్రానికి తరలించనున్నారు. నేటి సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్ధం భౌతికకాయాన్ని అక్కడే ఉంచనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తాజావార్తలు