ప్రైవేట్ అకాడవిూ డైరెక్టర్ దాష్టీకం
వార్డెన్ దొంగతనం ప్రశ్నించినందుకు దాడి
పివిసి పైపుతో విద్యార్థులను చితకబాదిన డైరెక్టర్
ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
విజయవాడ,మే5(జనం సాక్షి): ఓ కళాశాల డైరెక్టర్ విద్యార్థులపై వీరంగమాడాడు. రెండ్రోజుల్లో నీట్ పరీక్ష ఉందన్న ఆలోచన కూడా లేకుండా విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. లావుపాటి పీవీసీ పైపు తీసుకొని వారిపై దాడికి దిగడంతో పాటు చితకబాదడంతో విద్యార్థులు విలవిల్లాడారు. ఇందులో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలవగా మరో ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. కళాశాల డైరెక్టర్ అర్ధరాత్రి మొదలుపెట్టిన వీరంగం ఏకబిగిన అయిదు గంటల పాటు కొనసాగింది. వ్యవహారం చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరడంతో డైరెక్టర్ పోలీస్ స్టేషన్ పాలయ్యాడు. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.ఫణికుమార్ కానూరులో విశ్వ అకాడవిూ అనే విద్యా సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలో ఇంటర్ విద్యార్థులకు నీట్ పరీక్షకు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇస్తుంటారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఇందులో శిక్షణ పొందుతున్నారు. కళాశాలలో ఉన్న వసతి గృహంలోనే వీరు ఉంటుండగా నాలుగు రోజుల క్రితం రేవంత్ అనే విద్యార్థికి చెందిన నగదు రూ.2 వేలు చోరీకి గురయ్యాయి. దీనిపై విద్యార్థులు ఆరా తీసి కళాశాల వార్డెన్ వల్లభనేని గోపినాథ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ కళాశాల డైరెక్టర్ కె.ఫణికుమార్‌కు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. చర్యలపై తాత్సారం చేస్తుండడంతో విద్యార్థులు డైరెక్టర్‌తో వాదనకు దిగారు. దీంతో ఆగ్రహం చెందిన డైరెక్టర్ పొడవాటి పీవీసీ పైపు తీసుకొని శుక్రవారం రాత్రి విద్యార్థుల గదిలోకి ప్రవేశించాడు. తనకే నీతులు నేర్పుతారా అంటూ పైపుతో ఐదుగురు విద్యార్థులపై దాడికి దిగాడు. రాత్రి 11 గంటల నుంచి ఐదు గంటల పాటు విచక్షణ రహితంగా చితకబాదాడు. తామేం చేస్తున్నామని ప్రశ్నించిన విద్యార్థులపై మరింత రెచ్చిపోయి ఇష్టానుసారంగా కొట్టడంతో జానకిరామ్, తిరుమల అనే విద్యార్థులకు పక్కటెముకలు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురు విద్యార్థులకు బలమైన గాయాలయ్యాయి. శుక్రవారం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగా.. తీవ్రగాయాల పాలయిన విద్యార్థులు జానకిరామ్, తిరుమలలు నీట్ పరీక్షకు హాజరుకాగలడం ప్రశ్నార్థకంగా మారిందంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ఫణికుమార్ మద్యం మత్తులో తమను చితకబాదారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వార్డెన్‌పై చోరీ చేసినట్లు ఫిర్యాదు చేయగా అతడిపై కనీస చర్యలు తీసుకోకుండా పక్కకు తప్పించి ఇంటికి పంపించి వేశారని వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు డైరెక్టర్ ఫణికుమార్‌ను శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకొన్నారు. సంఘటన పూర్వాపరాలపై ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.