ఫలించిన లగడపాటి జోస్యం

చెప్పిన మేరకు నంద్యాలలో టిడిపి గెలుపు

విజయవాడ,ఆగస్ట్‌28: ఎన్నికల సర్వేల్లో లెక్క తప్పని అంచనాలతో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన కాంగ్రెస్‌ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ జోస్యం మరోసారి నిజమయ్యింది. నంద్యాలలో టిడిపి విజయం సాధిస్తుందని ఆయన చెప్పిన పోల్‌ ఫలితాలు దాదాపుగా నిజమయ్యాయి. ఉపఎన్నిక పోలింగ్‌ ముగిశాక ఓటరు నాడిపై లగడపాటి నిర్వహించిన ఆర్‌జీ ఫ్లాష్‌ సర్వే నాలుగు రోజుల కిందట వెల్లడించిన ఫలితం తెలుగుదేశం పార్టీవైపు మొగ్గు చూపింది. కౌంటింగ్‌ ముగిసే సరికి నంద్యాల ఓటర్లు పూర్తిగా టిడిపికి పట్టం కట్టారు.ఓటింగ్‌ శాతం భారీగా పెరిగినందున.. ఫలితంలో మార్పు వస్తుందని, వైసీపీ విజయం సాధిస్తుందని ఊహాగానాలు చెయ్యడం సరికాదన్నారు. నంద్యాలలో టీడీపీ 10 శాతం ఓట్ల మెజారిటీని సాధిస్తుందంటూ 1,73,335 మంది ఓటు వేసినందున.. 17,333 ఓట్ల మెజారిటీ టీడీపీకి రావచ్చని.. ఇది 15 వేలైనా కావొచ్చు.. 20 వేలకైనా రావొచ్చని అన్నారు. ఈ ఉప ఎన్నికను టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగాతీసుకున్నందునే పోలింగ్‌ శాతం పెరిగిందన్నారు. గతంలో లగడపాటి మరింత వివరంగా ఆధిక్యపు అంచనాలు కూడా ఇచ్చేవారు. అయితే, ప్రస్తుతం ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కాకుండా తన ఆసక్తి కొద్దీ ఈ సర్వే చేయించినట్లు చెప్పారు.

ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనందున ఏయే అంశాలు టీడీపీ గెలుపుపై ప్రభావితం చూపిస్తాయో చెప్పలేనని అన్నారు. తనకు రాజకీయాలు ప్రాణమే అయినప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొలగానన్నారు. మళ్లీ రాజకీయాల్లోకి తాను అడుగుపెట్టే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో లేకపోయినా విశ్లేషణ తన వ్యాపకం కనుక ఎన్నికల సర్వేలను కొనసాగిస్తానన్నారు. కేవలం ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సర్వేలు జరిపిస్తానని చెప్పారు. ఆర్‌జీ ఫ్లాష్‌ సర్వే ఫలితం వెలువడకముందు నంద్యాల ఫలితంపై టీడీపీ, వైసీపీ నేతలిద్దరూ ధీమాగా ఉన్నారు. బెట్టింగులు కూడా 100 కోట్లు దాటినట్లు సమాచారం. సర్వే ఫలితం తర్వాత సీను మారింది. వైసీపీ తరఫున బెట్టింగులోకి దిగేవారి సంఖ్య వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.

తాజావార్తలు