బాణాసంచా అమ్మకాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ
ఏలూరు,అక్టోబర్12(జనంసాక్షి): జిల్లాలో ఎవరైనా లైసెన్సు లేకుండా బాణసంచా తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్‌పి ఎం.రవిప్రకాష్ హెచ్చరించారు.అలాగే అమ్మకాలకు కూడా స్థానికంగా అనుమతులు పొందాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలో ఎవరైనా లైసెన్స్ లేకుండా బాణసంచా తయారు చేయరాదని, అక్రమాం నిల్వలు ఉంచరాదని అట్లు ఉంచిన యెడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దీపావళి మందుగుండు సామగ్రి విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. బాణసంచా తయారీ కేంద్రాలను కూడా ఎప్పటికప్పుడు తనికీలు నిర్వహించాలని సిబ్బందికి ఆయన సూచించారు. దీపావళి సామగ్రి తయారీ కేంద్రాల్లో నిబంధనలను అతిక్రమిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రవిప్రకాష్ హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 40 బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే అక్రమంగా తయారు చేస్తున్న కొన్ని కేంద్రాలను గుర్తించామని, వాటిపై చర్యలకు రంగం సిద్ధం చేశామన్నారు. తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉన్న వారు రెండు కేజీల బాణసంచా తయారీ ముడి సరుకులను తమ వద్ద ఉంచుకోకూడదని అన్నారు. తయారీ కేంద్రానికి, గోడౌన్‌కు మధ్య 150 విూటర్ల దూరం ఉండాలని తెలిపారు. అక్రమంగా బాణసంచా నిల్వ ఉంచినా, తయారు చేసినా వాటిని పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ పరిధిలోని ఎస్‌ఐ, సిఐ, డిఎస్‌పిలపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఆకివీడులో బాణసంచా రవాణా చేస్తూ ఆటో డ్రైవర్ మృతి చెందగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటనపై తయారీ కేంద్రం నిర్వాహకుడు ముసలయ్యపై కేసు నమోదు చేశామన్నారు. అతని లైసెన్సు కూడా రద్దు చేస్తామన్నారు. ఆ పరిధిలో ఉన్న సిఐపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రతిసోమవారం విూకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.