బాలకృష్ణ వ్యాఖ్యలపై భగ్గుమన్న భాజపా

గవర్నర్‌కు ఫిర్యాదుచేసిన భాజపా నేతలు
– పలు ప్రాంతాల్లో దిష్టిబొమ్మలు దహనం
– బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదన్న మాణిక్యాలరావు
– ఈ ఏడాదికాలంలో చంద్రబాబుకు చుక్కలు చూపిస్తాం – ఎమ్మెల్సీ సోము వీర్రాజు
విజయవాడ, ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): శుక్రవారం గుంటూరులో జరిగిన ధర్మదీక్ష సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు విష్ణుకుమార్‌ రాజు, మాధవ్‌ శనివారం గవర్నర్‌ నర్సింహన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రధానిమోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు పిర్యాదులో పేర్కొన్నారు. ఈవ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించాల్సింది ఉందని, వెంటనే బాలకృష్ణపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు గవర్నర్‌ను కోరారు. ప్రధాని మోదీపై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదు బీజేపీ నేత మాణిక్యాలరావు అన్నారు. సీఎం ధర్మపోరాట దీక్షతో రూ.30కోట్ల ప్రజాధనం వృథా అయిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…చంద్రబాబు చేసింది రాజకీయ అస్తిత్వ దీక్ష అన్నారు. ప్రధాని మోదీ దీక్ష చేస్తే ఖర్చులేదు… పాలన స్తంభించలేదని, చంద్రబాబు దీక్ష నాటకీయంగా సాగిందని మాణిక్యాలరావు విమర్శించారు. సీఎంను విమర్శించేవారికి దోషులుగా చూపే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాజకీయ విమర్శల్లోకి కుటుంబసభ్యులను లాగడం సరికాదన్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందు చంద్రబాబు దీక్ష చేశారని మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలు చేసేవారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు. విూడియాపై పవన్‌ అభిమానుల దాడి సరికాదన్నారు. స్వయం నియంత్రణతో విూడియా ముందుకెళ్లాలన్నారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు తెలిపారు. ఆయన శనివారం విూడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును సాక్షిగా పెట్టమని కోరుతున్నామన్నారు. ధర్మపోరాట దీక్షలో బాలకృష్ణ మాట్లాడుతున్నపుడు చంద్రబాబు నవ్వుతున్నారని ఆయన గుర్తుచేశారు. బాబు ప్రభుత్వం గాడి తప్పినట్టుందన్నారు. బాలకృష్ణ ఉపయోగించిన భాషను ఎవరు వాడుతారని ప్రశ్నించారు.
సీఎం వేదికపై ఉండగా బాలకృష్ణ మాట్లాడిన తీరును వర్ణించడానికి తన మనసు ఒప్పుకోవడం లేదని వీర్రాజు అన్నారు. 2019లో ఏం జరుగుతుందో చంద్రబాబుకు ఇపుడే కనపడుతోందని.. అందుకే ఆయన లయ తప్పి మాట్లాడుతున్నారన్నారు. ఏ రకంగా రూ. 30 కోట్లను దీక్ష కోసం చంద్రబాబు ఖర్చు చేస్తారని నిలదీశారు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కు టీడీపీకి అలవాటైపోయిందన్నారు. అన్ని ప్రాంతాల్లో చంద్రబాబు తీరును ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
పలు ప్రాంతాల్లో దిష్టిబొమ్మలు దహనం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అత్యున్నత పదవిలో ఉన్న మోదీని కించపరిచిన బాలకృష్ణను వెంటనే అరెస్టు చేయాలంటూ ఏపీ అంతటా బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం
చేసేందుకు బీజేపీ శ్రేణులు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకవైపు బీజేపీ శ్రేణులు బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా.. అందుకు ప్రతిగా టీడీపీ కార్యకర్తలు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. అదేవిధంగా ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు, శ్రేణులు అనంతపురం బాలకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు తెలుగు తమ్ముళ్లు కూడా అక్కడికి చేరుకొని బీజేపీ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత ఉద్రికత్త పరిస్థితి ఏర్పడటంతో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్‌రెడ్డి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

తాజావార్తలు