బిచ్కుంద ఉర్దూ మీడియంలో వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత
బిచ్కుంద జులై 11 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యా బోధనకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొవిడ్ మహమ్మారి వ్యాప్తితో గడచిన రెండేళ్లుగా ప్రత్యక్ష తరగతులు లేక విద్యార్థులు ఆన్‌లైన్ బోధనపై ఆధారపడాల్సి వచ్చింది. ఆ తర్వాత రెగ్యులర్ తరగతులు ప్రారంభమైనా ఉపాధ్యాయుల కొరతతో బోధన సక్రమంగా సాగడం లేదు. 2019-20 విద్యాసంవత్సరంలో మార్చి చివరి నుంచి పాఠశాలలు మూతపడగా, పరీక్షలతో నిమిత్తం లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు. ఆ తర్వాత 2021-22 విద్యా సంవత్సరంలో మూడున్నర నెలల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే తగినంత మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు లేక బోధనకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభం కావడంతో దాదాపు నెల రోజుల పాటు తరగతుల నిర్వహణ నామమాత్రంగా కొనసాగింది. అయితే కరోనా, లాక్‌డౌన్ అనంతరం 2021-2022 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే ఒరవడి ప్రస్తుతం విద్యా సంవత్సరం కూడా కొనసాగింది. కానీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం బోధనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత సంవత్సరంలో ఏకంగా 20 మందికి పైగా ఫెయిల్ అయ్యారంటే ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పైగా మైనారిటీ నాయకులు మేం చేశాం అంటే మేం చేశామని గొప్పలు చెబుతుంటారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించగా సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖకు తెలిపారని మైనార్టీ సోదరులు హర్షం వ్యక్తం చేశారు.