బిజెపిది సాంకేతిక విజయం మాత్రమే: టిడిపి
అమరావతి,మే15(జనం సాక్షి ): కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీది సాంకేతిక విజయం మాత్రమేనని మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్లే కర్ణాటకలో బీజేపీకి ఓట్ల శాతం పెరగలేదన్నారు. కొన్నిసార్లు ఓట్లు తక్కువగా వచ్చినా సీట్లు పెరుగుతాయని, బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవడంలో కర్ణాటకలోని బీజేపీయేతర పార్టీలు విఫలం అయ్యాయని కాల్వ విమర్శించారు. బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కేవలం 36 శాతం మాత్రమేనని ఆయన అన్నారు. ఇదిలావుంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ఆగ్రహం స్పష్టంగా కనిపించిందని టీడీపీ నేత లంకా దినకర్ అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 36 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని ఆయన చెప్పారు. బాగేపల్లిలో బీజేపీ అభ్యర్ధి సాయికుమార్‌కు డిపాజిట్ గల్లంతైందని ఎద్దేవా చేశారు. కాగా సీఎం చంద్రబాబుపై బీజేపీ నేత రాంమాధవ్ విమర్శలు అర్థరహితమని లంకా దినకర్ మండిపడ్డారు. ఫలితాల్లో బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 76 స్థానాల్లో, జేడీఎస్ 40 స్థానాల్లో విజయం సాధించాయి. స్వతంత్రులు రెండు స్థానాలు దక్కించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 112 సీట్లు సాధించాల్సి ఉంది. మేజిక్ ఫిగర్‌కు బీజేపీ 8 స్థానాల దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి 116 స్థానల్లో గెలుపొందాయి.