బిజెపిలో పెరుగుతున్న అసంతృప్తి
బయటపడే ఆలోచనలో నేతలు?
విజయవాడ,సెప్టెంబర్13(జనంసాక్షి): పదవులు ఆశించి కమలం పార్టీలో చేరిన వారికి పెద్దగా ప్రయోజనాలు కలగడం లేదు. దీంతో పార్టీలో చేరిన వారు మెల్లగా బయటపడాలని చూస్తున్నట్లు సమాచారం. కన్నా లక్ష్మీనారాయణ,కావూరి సాంబశివరావు వంటి నేతలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. దీంతో పార్టీలో చేరిన నేతల్లో ఇప్పుడు అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. గడచిన మూడేళ్ళలో ఎపిలో బిజెపి ప్రజా వ్యతరేకతనే మూటగట్టుకుంటోంది. ఈ నేపధ్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండి వచ్చే ఎన్నికల వరకూ పోరాటాలు చేసి మళ్ళీ ప్రజాదరణ పొందాలని అనుకుంటున్నారు. కాగా మరికొందరేమో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రోజురోజుకూ మారుతున్న రాజకీయ సవిూకరణల్లో బిజెపి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నేతలకు నిరాసనే మిగిల్చింది. ఎవరినైనా భాజపాలోకి పిలిస్తే వస్తే తమకేమిటి లాభమని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. దానికి రాష్ట్ర నేతల వద్ద నుండి సరైన హావిూ గానీ సమాధానం లేదు. దశాబ్దాల తరబడి పార్టీనే నమ్ముకున్న నేతలకే ఇప్పటి వరకూ దిక్కులేకుండా ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎందుకనో నేతలు రావడంలేదు. వైసీపీ పట్ల
అసంతృప్తితో ఉన్న ఎంఎల్‌ఏలు, ఎంపిలుంటే వారు టిడిపిలోకి వెళ్ళటానికే మొగ్గు చూపుతారే గానీ భాజపావైపు కన్నెత్తి కూడా చూడరు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేక¬దా, ప్రత్యేక ప్యాకేజి, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, ఆర్ధికలోటు భర్తీ తదితరాల విషయంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో గానీ ఆ తర్వాత గానీ టిడిపిలో చేరటానికి ఇష్టపడని కాంగ్రెస్ నేతలు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలు భాజపాలో చేరారు. వీరంతా ఇప్పుడు అసంతృప్తితో రగలిపోతున్నారని సమాచారం. చేరిన నేతలే పార్టీని వీడుతారని సమాచారం. రాజకీయ శూన్యాన్ని భర్తీ చేసే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో కమలనాధులు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ నీరుగారిపోయింది. ఏ పార్టీలోనూ లేనట్లు ఇతర పార్టీల్లోని నేతలను ఆకర్షించటానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుతో పలువురు వచ్చి చేరారు. పార్టీకి రాష్ట్రంలో సొంతబలం లేదు కాబట్టి ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించాలని అనుకున్నది. దానికి తగ్గట్లే పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా ఆ మధ్య ఇతర పార్టీల నుండి నేతలను ఆకర్షించమని రాష్ట్ర నేతలను ఆదేశించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉంది కాబట్టి సదరు శూన్యతను తమ పార్టీనే భర్తీ చేయాలని అమిత్‌షా రాష్ట్ర నేతలకు గట్టిగా చెప్పారు. సీనియర్ నేత, ఎంఎల్‌సి సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి, రాంభూపాల్ రెడ్డి, శాంతారెడ్డి ఉన్నారు. జిల్లాల వారీగా, పార్టీల వారీగా ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను గుర్తించటం, వారితో నేరుగా గానీ లేదా ఫోన్ ద్వారా గాని సంప్రదించాలని కూడా కమిటీ అనుకున్నది. ఆ మేరకు కొంత కసరత్తు కూడా మొదలుపెట్టింది. అయితే, వారి కసరత్తులో ఆపరేషన్ ఆకర్ష్‌కు ఒక నేత కూడా దొరకలేదని సమాచారం. రాష్ట్రంలో ప్రధానంగా రెండే పార్టీలున్నాయి. ఒకటి అధికార తెలుగుదేశంపార్టీ, రెండోది ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టిన టిడిపి వైసీపీలోని సుమారు 20 మంది ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలను లాగేసుకున్నది. ఇంకా ఆకర్ష్‌ను ఉధృతం చేయాలని అనుకుంటున్నది. ఈ నేపధ్యంలో టిడిపికి మిత్రపక్షమైన బిజెపి కూడా అదే ఆపరేషన్ మొదలుపెట్టినా పెద్దగా లాభంలేకుండా పోయింది.