బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కంభంపాటి
– ప్రకటించిన జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా
– ఏపీలో కొత్త సారధికోసం కసరత్తు
– కాపు సామాజిక వర్గం వ్యక్తికే అధ్యక్షపీఠం?
అమరావతి, ఏప్రిల్18(జనంసాక్షి) : ఏపీ రాజకీయాల్లో బీజేపీ అధిష్టానం వేగంగా పాలువులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కంభంపాటి హరిబాబును జాతీయ కార్యవర్గ సభ్యుడిగా బీజేపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆదేశాలు జారీ చేశారు. హరిబాబు రాజీనామాతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న అధ్యక్ష పీఠాన్ని భర్తీ చేసేందుకు అధిష్టానం కొంత సమయం తీసుకుంటుందని అందరూ భావించారు. దీనికితోడు ప్రస్తుతం కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏపీ అధ్యక్షపీఠం భర్తీపై ఇప్పట్లో ఆలోచించే అవకాశం లేదని బీజేపీ శ్రేణులుసైతం భావించాయి. కానీ హరిబాబును జాతీయ స్థాయిలో పంపించటం, ఏపీ నూతన అధ్యక్షుని ఎంపికలో వేగంగా చర్యలు తీసుకోవటం చూస్తుంటే ఏపీలో బలోపేతం అయ్యేందుకు బీజేపీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది. కాగా ఏపీ బీజేపీ అధ్యక్షుని పేరును బుధవారం రాత్రి కానీ, గురువారం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అధ్యక్ష పదవి కోసం బీజేపీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. నలుగురి పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసింది. వీరిలో సోమువీర్రాజు, మాణిక్యాలరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి ఈ నాలుగు పేర్లు జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు ఆకుల సత్యనారాయణ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురిలో ఒకరిని ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికే అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సామాజిక వర్గాల ఆధారంగానే అధ్యక్ష పదవి ఎంపిక జరుగుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పీఠం అప్పగించడం ద్వారా కాపుల మద్దతు కూడగట్టుకోవచ్చని, తద్వారా తెదేపాకు అండగా ఉంటూ వస్తున్న కాపులను తమవైపుకు తిప్పుకొని తెదేపాకు గట్టిషాక్ ఇచ్చేందుకు అధిష్టానం ఆలోచనగా ఉన్నట్లు బీజేపీలోని పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఏదిఏమైనప్పటికీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని కూడా నియమించటం ఖాయంగా కనిపిస్తుంది.