బూర్జ్ ఖలీఫాను సందర్శించిన చంద్రబాబు
అమరావ తి,అక్టోబర్23(జనంసాక్షి): దుబాయ్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫా అందాలను వీక్షించింది. ఆకాశహర్మ్యం విశేషాలను తెలుసుకుంది. అమెరికా పర్యటన ముగించుకుని సిఎం చంద్రబాబు బృందం దుబాయ్చేరుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు యూఏఈలోని బిజినెస్ ఎమిరేట్స్ టవర్స్‌లో డీపీ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్, సీఈవోతో చంద్రబాబు భేటీ అయ్యారు. రానున్న కాలంలో ఓడరేవు సరకు రవాణా యావత్తూ తూర్పుతీరం నుంచే జరుగుతుందని తెలిపారు. వాయువ్య ప్రాంతాల సరకు రవాణాను తూర్పు నౌకాశ్రయాలకు అనుసంధానించాల్సి ఉందనన్నారు. ఆంధప్రదేశ్‌లోని నౌకాశ్రయాలకు విస్తృత సేవలందించగల సామర్థ్యం, సత్తా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో భాగంగా ఆంధప్రదేశ్‌లో 750 కోట్ల డాలర్ల పెట్టుబడులకు సంబంధించి రెండు ప్రముఖ సంస్థలతో ఆదివారం కీలక ఒప్పందాలు జరిగాయి. విజయవాడ, విశాఖ, తిరుపతి నగరాలకు ఎమిరేట్స్ విమాన సర్వీసుల నిర్వహణకు కూడా మార్గం సుగమం అయింది. రాష్ట్రంలో దశలవారీగా 550 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఏరోసిటీ నిర్మాణానికి మహ్మద్ అబ్దుల్ రెహమాన్ అల్ జూరానీకి చెందిన ఏవియేషన్ సిటీ ఎల్‌ఎల్‌పీ సంస్థ ముందుకు వచ్చింది. ఆ సంస్థ, ఆంధప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ) ప్రతినిధులు ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రెండో ఒప్పందం బిన్ జాయేద్ గ్రూప్‌తో కుదిరింది. ఆ సంస్థ ఆంధప్రదేశ్‌లో మౌలిక వసతుల రంగంలో 200 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనుంది. అవగాహన ఒప్పందంపై ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, బిన్ జాయేద్ గ్రూపు తరఫున సంస్థ ఎండీ
మిధాత్ కిద్వాయ్ సంతకాలు చేశారు. ఈ రెండు ఒప్పందాల విలువ రూపాయి మారకంలో సుమారు రూ.48,750 కోట్లు. మూడు రోజులు యూఏఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ఆదివారం రెండో రోజు దుబాయిలో పలువురు ప్రభుత్వ, వాణిజ్య ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఆంధప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయికి చెందిన డీపీ వరల్డ్ సంస్థ సంసిద్ధత తెలియజేసింది.