లండన్‌లో అమరావతి బృందం
బృందంలో నారాయణ, రాజమౌళి తదితరులు
నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో చర్చలు
అమరావతి,అక్టోబర్12(జనంసాక్షి): రాజధాని నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. రాజధాని తుది డిజైన్ల కోసం ఏపీ ప్రభుత్వం బృందం లండన్ వెళ్లింది. ఈ బృందంలో దర్శకుడు రాజమౌళి కూడా
ఉన్నారు. మరోవైపు అమరావతిలో వీఐపీ నివాసాల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. దర్శకుడు రాజమౌళి, మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ అధికారులు లండన్ వెళ్లారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో మాట్లాడుతారు. ఇప్పటికే పలు డిజైన్లను ఆ కంపెనీ రూపొందించగా, సిఎం చంద్రబాబు అందులో కొన్ని మార్పులు చేశారు. దీనికి సంబంధించి దర్శకుడు రాజమౌళి సూచనలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మంత్రి నారాయణ, డీఆర్‌డీఏ అధికారులతో పాటు రాజమౌళి కూడా లండన్ వెళ్లారు. ఇప్పటికే నార్మన్ పోస్టర్స్ ప్రతినిధుల బృందానికి రాజమౌళి పలు సూచనలు చేశారు. ఈ బృందం మూడు రోజుల పాటు లండన్‌లోనే ఉంటుంది. అందరూ కూర్చొని చర్చలు జరిపిన అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చి దిద్దాలనుకుంటున్న సిఎం చంద్రబాబు నిర్మాణాత్మక సలహాలు ఎవరు అందించినా వాటిని స్వీకరించాలని నిర్ణయించారు.అనేక తరాలు గర్వంగా చెప్పుకునే గొప్ప ప్రజా రాజధానిని నిర్మిస్తున్నామన్న భావన ఈ ప్రాజెక్టులో పాలు పంచుకునే ప్రతి ఒక్కరిలో ఉండాలని, దానికి తగ్గట్టుగానే నిర్ధిష్ట కార్యప్రణాళికతో పనిచేయాలని అన్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా పనులు జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్రాంత మౌలిక వసతుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చించారు. రాజధానిలోని మొత్తం 13 జోన్లలలో 5 జోన్లను హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో అభివృద్ధి చేస్తారు. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ అభివృద్ధి పనులను చేపడతారు. తొలిసారిగా ఒక నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ప్రాజెక్టు కోసం హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌కు వెళుతున్నారు. ఇందులో భాగంగా మొత్తం 5 జోన్లలో రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్, నీటి సదుపాయాల కల్పన వంటి వివిధ రకాల పనులను చేపడతారు.ప్రతి జోన్‌లోనూ రహదారులు, వారధులు, విద్యుత్, నీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఐసీటీ వంటి మౌలిక వసతుల ఏర్పాటుచేస్తారు. రాష్ట్ర శాసనసభ, హైకోర్టు భవంతుల తుది ఆకృతులు, నిర్మాణ ప్రణాళికలపై ఫోస్టర్ అండ్ పార్టనర్స్‌తో చర్చించడానికి ఏపీ సీఆర్‌డీఏ బృందం ఈనెల 11 నుంచి 13 వరకు లండన్‌లో పర్యటించనున్నది. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల భావనాత్మక ప్రణాళికలను ఈనెల 12న ఫోస్టర్ అండ్ పార్టనర్స్ ఏపీ సీఆర్‌డీఏ బృందానికి సమర్పిస్తారు. అమరావతిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించడానికి స్టెడీఎరీనా అనే బ్రిటీష్ సంస్థ ముందుకొచ్చింది. వాలీబాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్ వంటి క్రీడలకు అనువైన ప్రాంగణాలన్నీ ఒకేచోట నిర్మిస్తారు. 20 ఎకరాల విస్తీర్ణంలో కృష్ణానదికి అభిముఖంగా ఈ స్పోర్ట్స్ కాంప్లోక్స్ నిర్మించాలని సీఆర్‌డీఏ తలపోస్తోంది. దీనిని అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటుచేయాలని మంత్రి పి. నారాయణ సూచించారు. ¬టళ్లు, షాపింగ్ మాల్స్ వంటివి ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.