బెంగళూర్‌లో క్లీన్‌స్వీప్‌

5 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా
బెంగళూర్‌ ,సెప్టెంబర్‌ 3:ఆధిపత్యం చేతులు మారుతూ రసవత్తరంగా సాగిన బెంగళూర్‌ టెస్టులో చివరికి టీమిండియానే విజయం సాధించింది. కివీస్‌ విసిరిన 261 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు మంచి పునాది వేస్తే… తర్వాత పుజారా , కోహ్లీ , ధోనీ రాణించి జట్టును గెలిపించారు. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. 9 వికెట్లకు 232 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో ఇవాళ ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ కాసేపటికే ఆఖరి వికెట్‌ కోల్పోయింది. టెయిలెండర్‌ జీతన్‌ పటేల్‌ ధాటిగా ఆడి 22 పరుగులు చేసి చివరి వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌కు 248 పరుగుల దగ్గర తెరపడింది. భారత బౌలర్లలో అశ్విన్‌ 5 , ఓజా 2 , ఉమేశ్‌ యాదవ్‌ 2 , జహీర్‌ఖాన్‌ 1 వికెట్‌ పడగొట్టారు. పటేల్‌ను ఔట్‌ చేయడం ద్వారా జహీర్‌ సొంతగడ్డపై 100 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు సెహ్వాగ్‌ , గంభీర్‌ శుభారంభం ఇచ్చారు. పిచ్‌ బౌలర్లకు , బ్యాట్స్‌మెన్‌కూ సమానంగా అనుకూలిస్తుండడంతో వీరిద్దరూ ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టారు. తొలి వికెట్‌కు 77 పరుగులు జోడించాక.. సెహ్వాగ్‌ వెనుదిరిగాడు. తర్వాత గంభీర్‌ కూడా ఔటవడంతో భారత్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థుతుల్లో పుజారా , సచిన్‌ నిలకడగా ఆడడంతో వికెట్ల పతనానికి కాసేపు బ్రేక్‌ పడింది. అయితే సిరీస్‌లో వరుసగా విఫలమవుతోన్న సచిన్‌ మరోసారి సౌథీ బౌలింగ్‌లోనే క్లీన్‌బౌల్డవడం విశేషం. ధాటిగా ఆడి 48 రన్స్‌ చేసిన పుజారా కూడా కాసేపటికే ఔటయ్యాడు. ఈ దశలో వైస్‌ కెప్టెన్‌ కోహ్లీ , కెప్టెన్‌ ధోనీ భారత ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఫామ్‌లో ఉన్న వీరిద్దరూ నిలకడగా ఆడుతూ ఆరో వికెట్‌కు అజేయంగా 96 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్‌ సెంచరీ కంప్లీట్‌ చేసుకున్నాడు. వీరిద్దరి జోరుతో భారత్‌ 63.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌కు గత ఏడాది ఇంగ్లాండ్‌ , ఆస్టేల్రియా పర్యటనల తర్వాత తొలి సిరీస్‌ విక్టరీని రుచి చూసింది. అలాగే జట్టును గెలిపించిన ధోనీ అరుదైన రికార్డ్‌ సాధించాడు. సొంతగడ్డపై భారత తరపున అత్యధిక టెస్ట్‌ విజయాలు సాధించిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ , రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది. సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డ్‌ లభించింది.

తాజావార్తలు