బోట్ ప్రమాద విషయం తెలిసి గుండె బరువెక్కింది
– జవాబుదారీతనంలేని పాలనా విధానాల వల్లే ఇలాంటి దారుణాలు
– జనసేన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి, మే16(జనం సాక్షి) : గోదావరిలో లాంచీ ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాద విషయం తెలియగానే గుండె బరువెక్కింది అన్నారు. గిరిజనులు జలసమాధికావడం బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలకు జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని తమపార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం గిరిజనులకు శాపం కావద్దు అన్నారు. జవాబుదారీతనంలేని పాలనా విధానాల వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల వద్దకు పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. పాలకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి.. గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కృష్ణానది ప్రమాదం మర్చిపోకముందే గోదావరిలో లాంచి ప్రమాదం చోటు చేసుకోవడంపై
విచారం వ్యక్తం చేశారు.
శెట్టిపల్లి భూముల జోలికొస్తూ ఊరుకోం..
శెట్టిపల్లి భూ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వమని జనసేన నేత పవన్ కల్యాణ్ అన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన బుధవారం శెట్టిపల్లి భూనిర్వాసితులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఓట్లు వేసినవారే టిడిపికి ఎదురు తిరుగుతున్నారు. గ్రామాల మధ్య టిడిపి ప్రభుత్వం వివక్ష చూపుతోందన్నారు. కోట్లు ఎగ్గొట్టిన పైడిపల్లె గ్రామానికి న్యాయం చేసిన టిడిపి శెట్టిపల్లికి మాత్రం అన్యాయం చేసిందన్నారు. వేల కోట్లు దోచుకునే తెలివితేటలు ఉన్న టిడిపి 600 ఎకరాలు కాపడలేదా అని పవన్ ప్రశ్నించారు. వెంటనే శెట్టిపల్లి రైతులకు న్యాయం చేయాలని, అలా కాకుండా వారి భూములను లాక్కొవడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.