భయంతో పాఠశాలకు తాళం
విశాఖపట్నం, జిల్లాలోని పాడేరు మండలం ఓబర్తిలో దెయ్యం ఉందనే భయంతో ఓ బడికి తాళం పడింది. 15 రోజుల క్రితం వరకు బడి కళకళలాడుతూ ఉండేది. అయితే ఆ తరువాత పాఠశాల పేరు ఎత్తితేనే విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో విద్యార్థులు లేకుండా స్కూల్ ఖాళీగా దర్శనమిస్తోంది. అయితే స్కూల్‌కు వెళ్లకపోవడానికి గల కారణాన్ని విద్యార్థులు భయంభయంతో చెప్పుకొచ్చారు. కొన్ని రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన భీములమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమెను అక్కడ దగ్గర్లో ఉన్న శ్మశానంలో పూడ్చిపెట్టారు. స్కూలుకు వెళ్లాలంటే ఆ దారి గుండానే వెళ్లాలి.
దీంతో దెయ్యంగా మారిన భీములమ్మ తమను భయపెడుతోందంటూ విద్యార్థులు వాపోయారు. అటుగా వెళ్లిన వారిపై రాళ్లు రువ్వుతోందని చెబుతున్నారు. దెయ్యంగా మారిన భీములమ్మ ఓ ఇంట్లో ఉందంటూ గ్రామస్తులు ఆ ఇంటిని సైతం తగులబెట్టారు. అప్పటి నుంచి మరింతగా భయపెడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పిల్లలకు ఎంత నచ్చజెప్పినా బడికి వెళ్లడం లేదంటున్నారు. టీచర్లు వచ్చినా ఎంత నచ్చజెప్పినా విద్యార్థులు మాత్రం స్కూల్ వైపు కన్నెత్తైనా చూడటం లేదు. మరి వారి భయం పోయెదెప్పుడో? బడికి వెళ్లేదెప్పుడో చూడాలి.