భవిష్యత్‌లో పెద్ద ఎత్తున సోలార్ ఎనర్జీ ఉత్పత్తి
విద్యుత్ ఛార్జీలు తగ్గడమే తప్ప పెరగడం ఉండదు
మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలి
వనం -మనం కార్యక్రమంలో చంద్రబాబు
అమరావతి,నవంబర్18(జనంసాక్షి): భవిష్యత్‌లో రాష్ట్రంలో కరెంటు చార్జీలు పెంచే ప్రసక్తే లేదని, తగ్గించాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సోలార్ ఎనర్జీ పెద్ద ఎత్తున ఉత్పత్తి జరునుందని, దీంతో వినయోగదారులకు విద్యుత్ ఛార్జీల భారం పడదన్నారు. శనివారం రాజధాని అమరావతిలో పచ్చదనం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా దీనిని చేపట్టారు. ఈ సందర్బంగా మందడంలోని సీడ్ యాక్సెల్ రోడ్డు దగ్గర మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. అలాగే ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాలు రాబోతున్నాయన్నారు. కాగా… అమరావతిలో రహదారికిరువైపులా విరివిగా మొక్కలు నాటాలని, మూడు వేల కిలోవిూటర్ల మేర సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో పొల్యూషన్‌కు అవకాశం లేకుండా చూస్తామన్నారు. ఉద్యోగులు కార్యాలయాలకు సైకిళ్లపై వెళల్‌ఏలా ట్రాక్ నిర్మిస్తామని అన్నారు. ఎన్ని వస్తువులనైనా తయారు చేసుకోవచ్చు కానీ వర్షాన్ని కురిపించలేమని ఆయన అన్నారు. చెట్లను పరిరక్షిస్తేనే సకాలంలో వర్షాలు పడతాయని సీఎం అన్నారు. ఇకపోతే ప్రపంచం మెచ్చే గ్రీన్, బ్లూ సిటీగా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అగ్రిటెక్ సదస్సును విజయవంతంగా నిర్వహించామని, మైక్రోసాప్ట్ హైదరాబాద్ రావడం వల్ల అన్ని కంపెనీలు వచ్చాయన్నారు. అలాగే బిల్‌గేట్స్ ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్‌గా మార్చారని, బిల్‌గేట్స్ తన సంపాదనలో ఎక్కవ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. అందరికీ సామాజిక స్పృహ ఉండాలని, ప్రకృతిని కాపాడుకుంటే…. ప్రకృతే మనల్ని కాపాడుతుందని, వాతావరణ సమతుల్యం దెబ్బతినడం వల్లే ప్రకృతి విపత్తులు వస్తున్నాయన్నారు. టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయని, అందుకు అనుగుణంగా మనం కూడా మారాలని సీఎం అన్నారు. అభివృద్ధికి కొందరు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం జరగకుండా హైకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేశారన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాజధాని నిర్మాణం ఆగదని సీఎం స్పష్టం చేశారు. అయితే గ్రీన్ ట్రిబ్యులన్ అనుకూలంగా తీర్పును ఇచ్చిందన్నారు. ఇది మన సత్తా అన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఆయన మరోమారు అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం రావి-వేప మొక్కలకు ప్రత్యేక పూజలు చేశారు. రాజధాని అమరావతిలో పచ్చదనం కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారు. అనంతరం పైలాన్ ను ఆవిష్కరించారు. అలాగే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు శ్రావణ్, రావెల కిషోర్‌బాబు, మహిళా కమిషన్ ఛైర్మన్ రాజకుమారి, ఫుడ్ కమిషన్ ఛైర్మన్ పుష్పరాజ్, దివ్యాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ కోటేశ్వరరావు, జెడ్పీ వైస్ ఛైర్మన్ వడ్లమూడి
పూర్ణ చంద్రరావు, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు పాల్గొన్నారు.