భారీగా ఎర్రచందనం దుంగల స్వాధీనం
తిరుపతి,నవంబర్1(జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీశాఖ, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. అయినా ఎర్రచందనం అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. తాజాగా భాకరాపేట అటవీప్రాంతంలో సుమారు రూ.కోటి విలువ చేసే 29 ఏ-గ్రేడ్‌కు చెందిన ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఎఫ్‌ఆర్‌వో రఘునాథరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. భాకరాపేట అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు మంగళవారం సాయంత్రం నుంచి కూంబింగ్ చేపట్టారు. అటవీప్రాంతంలోని పుట్టపాయింట్ ఎగువప్రాంతంలో ఎర్ర స్మగ్లర్లు దుంగలను మోసుకొస్తూ అధికారులకు ఎదురుపడ్డారు. దీంతో అప్రమత్తమైన స్మగ్లర్లు దుంగలను చెల్లాచెదురుగా పడేసి
చేతికందిన రాళ్లు తీసుకొని అటవీ సిబ్బందిపై దాడి చేస్తూ పారిపోయారు. వారి కోసం అధికారులు గాలింపు చేపట్టారు. సమాచారం అందుకున్న డీఎఫ్‌వో ఫణికుమార్ నాయుడు సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ దాడిలో అటవీశాఖ అధికారులు నాగరాజు, నందకుమార్, జాన్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
స్మగ్లర్ నయీమొద్దీన్ అరెస్ట్
మరోవైపు ఎర్రచందనం స్మగ్లర్ నసీముద్దీన్ ఖాన్‌ను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్బంగా 54 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాలుగు వాహనాలను కూడా సీజ్ చేశారు. బెంగళూరులోని ఓ ఫాంహౌస్‌లో ఉన్న నసీముద్దీన్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా… బెంగళూరులోని ఓ ప్రాంతంలో ఎర్రచందనం భారీ డంప్‌ను తిరుపతి రూరల్ పోలీసులు ఇటీవల గుర్తించిన సంగతి తెలిసిందే. తిరుపతి ప్రాంతంలో లభ్యమైన ఎర్రచందనాన్ని బెంగళూరుకు తరలించి అక్కడ గోడౌన్‌లలో దాచి ఉంచారు. ఈ సమాచారమందుకున్న పోలీసులు పెద్దఎత్తున దాడులు నిర్వహించి ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.