భూమాపై సానుభూతి..టిడిపి డబ్బు గెలిపించాయి
నంద్యాల ఫలితంపై శిల్పా మోహన్ రెడ్డి వ్యాఖ్య
నంద్యాల,ఆగస్ట్28: నంద్యాల ఉప ఎన్నికలో భూమా సానుభూతి పనిచేసిందని, అలాగే టిడిపి పెద్ద ఎత్తున డబ్బులు పంచిందని కౌంటింగ్ సరళిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లకు టీడీపీ భారీగా డబ్బు పంచడం, భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి వల్ల ఆ పార్టీ అభ్యర్థికి ఆధిక్యం లభించడానికి కారణం కావొచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాలలో చేపట్టిన అభివృద్ధి వల్లే టీడీపీకి ఓట్లు పడ్డాయన్న వాదనను తాను విశ్వసించడం లేదని చెప్పారు. అనారోగ్యం, మలేరియా ఫీవర్ 28 రోజులు తాను ప్రజల్లోకి వెళ్లలేకపోయానని, అయితే, ఆ ప్రభావం పడలేదని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతానికి 18వేల ఓట్లకుపైగా ఆధిక్యం టీడీపీకి వచ్చిన నేపథ్యంలో ఇంత ఆధిక్యం తగ్గించడం సాధ్యపడకపోవచ్చునని, ఏదిఏమైనా ప్రజాతీర్పును గౌరవిస్తానని ఆయన చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో పార్టీ నేతలు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేశారని తెలిపారు.
నంద్యాల ఉపఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్ధం తారాస్థాయిలోనే కొనసాగింది. నంద్యాలలో టీడీపీ ఓడిపోతే రాజీనామా చేస్తానని మొదట మంత్రి భూమా అఖిలప్రియ సవాల్ చేసింది. అప్పటి నుంచి నంద్యాల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కూడా అఖిలప్రియ మాదిరే తిరిగి సవాల్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోతే రాజీనామాతో పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటానని శిల్పా చెప్పారు. ఈ సవాల్‌పై సాయింత్రం మాట్లాడుతానని ఆ సవాల్‌ని అధికార పక్షం స్వీకరించలేదు కదా.. అంటూ వ్యాఖ్యానించారు. ఫలితం సరళి చూశాక కౌంటింగ్ ప్రాంతం నుంచి శిల్పా మోహన్‌రెడ్డి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దాంతో, ప్రతిపక్షం వైఎస్సార్సీపీ శ్రేణులు డీలాపడిపోయాయి. వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి, ఓటమిని అంగీకరించేశారు. ఓటర్లు సానుభూతి వైపే మొగ్గు చూపారనీ, డబ్బు ప్రభావం బాగా పనిచేసిందని శిల్పా మోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. సరిగ్గా ఎన్నికలకు ముందు అభివృద్ధి కార్యక్రమాలతో అధికార పార్టీ, ప్రజల్ని తప్పుదోవ పట్టించిందని శిల్పా మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికకు ముందు శిల్పా మోహన్‌రెడ్డి, టీడీపీని వదిలి వైఎస్సార్సీపీలో చేరిన విషయం విదితమే. ఆయన వెంట, సోదరుడు చక్రపాణిరెడ్డి సైతం వైఎస్సార్సీపీలోకి వెళ్ళారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ టీడీపీని వీడి, వైఎస్సార్సీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి వెళ్ళిన విషయం విదితమే.