భూ సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం 

– న్యాయమైన హక్కుల కోసమే ఢిల్లీతో సీఎం పోరాటం
– చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి
– కలెక్టర్‌ల సదస్సులో డిప్యూటీ సీఎం కె.ఈ కృష్ణమూర్తి
అమరావతి, మే8(జ‌నం సాక్షి) : రెవెన్యూ రంగంలో కీలకమైన భూ సంస్కరణలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. న్యాయమైన హక్కుల సాధన కోసమే ముఖ్యమంత్రి కేంద్రంతో పోరాటం చేస్తున్నారని… అందుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. రాజకీయ పరిస్థితులు ఊహించని మలుపులు తిరుగుతున్నాయని… దేశ రాజకీయాలను సోషల్‌ విూడియా ఎంతగానో ప్రభావితం చేస్తోందన్నారు. పార్లమెంట్‌లో ఆమోదించిన చట్టాలను అమలు చేయడంలో అనాసక్తి చూపడం, రాష్ట్రాలకు ఇచ్చిన హావిూలను అమలు చేయకపోవడం, ఫెడరల్‌ స్పూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేఈ దుయ్యబట్టారు. పట్టణ, గ్రావిూణ ప్రాంతాల్లోని అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని, ఇళ్లు నిర్మించుకున్న వాటిని క్రమబద్దీకరించేందుకు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు ఈ విషయంలో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను క్షేత్రస్ధాయిలో సమర్ధవంతంగా అమలుపరిచే బాధ్యతను కలక్టర్లే తీసుకోవాల్సి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
రెవెన్యూ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, అన్ని రకాల భూములను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు భూ సేవ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. అలాగే ఆధార్‌ తరహాలో 11 అంకెల విశిష్ట సంఖ్యతో భూధార్‌ కేటాయిస్తామని, భూమికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 2.84 కోట్ల వ్యవసాయ భూములు, 50 లక్షల పట్టణ ఆస్తులున్నాయని, 8.5 లక్షల గ్రావిూణ ఆస్తులకు భూ-ధార్‌ కేటాయిస్తున్నామని కేఈ తెలియజేశారు.

తాజావార్తలు