మంచినీటి సమస్య రాకుండా చర్యలు

క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టాలి: కలెక్టర్‌
ఏలూరు,మే8(జ‌నం సాక్షి): జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించడానికి అనువుగా ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు. వేసవిలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారనే మాట వినపడకూడదని చెప్పారు.తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ఆర్‌డబ్లుయఎస్‌ అధికారులతో సవిూక్షించారు.  ఏదైనా గ్రామంలో తాగునీటి సరఫరాకు సంబంధించిన మోటారు మరమ్మతుకు గురైతే వెంటనే మరో మోటారు ఏర్పాటుచేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, నరసాపురం ఆర్‌డబ్లు?యఎస్‌ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అన్ని గ్రామాల్లో నూరుశాతం పన్నులు వసూలు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. గ్రామ కార్యదర్శులు ప్రతిరోజు ఉదయాన్నే గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించాలని ఆదేశించారు. ఇకపోతే జిల్లాలో జనన, మరణ ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లోనే జారీ చేయాలని.. అధికారులెవరైనా వీటిని చేతి రాతతో ఇస్తే నకిలీవిగా పరిగణిస్తామని కలెక్టర్‌ భాస్కర్‌ స్పష్టం చేశారు. జిల్లాలో 15 లక్షలకుపైగా జనన, మరణ ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని, వాటిని ఎక్కడి నుంచైనా చూసుకునే అవకాశం ఉందన్నారు. చాలాచోట్ల ఆస్తి తగాదాలు, ఇతర అంశాల్లో అధికారుల నుంచి చేతి రాతల ద్వారా పొందిన పత్రాల ద్వారానే అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి అక్రమాలకు తావులేకుండా జనన, మరణ ధ్రువపత్రాలను విూసేవ కేంద్రాల నుంచి డిజిటల్‌ సంతకాల ద్వారా ప్రజలు పొందే అవకాశాన్ని కల్పించామని తెలిపారు.  గ్రామాల్లో వీధి దీపాలను త్వరలో స్మార్ట్‌ ఎల్‌ఈడీలు గా మారుస్తామని కలెక్టర్‌ భాస్కర్‌ చెప్పారు.

తాజావార్తలు