మండల్ కమీషన్ సిఫార్స్‌ను అమలు చేయాలి – జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
జనంసాక్షి, మంథని : మండల్ కమీషన్ సిఫార్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలనే డిమాండ్‌తో మండల్ డేను జరుపుకోవడం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. మండల్ డే ను పురస్కరించుకుని సోమవారం మంథని పట్టణంలో ఏర్పాటుచేసిన బీపీ మండల్ విగ్రహానికి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండ శంకర్, జెడ్పిటిసి తగరం సుమలత , వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ తదితరులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగములో కల్పించిన ఆర్టికల్ 340 ప్రకారం సామాజిక విద్యాపరంగా వెనుకబడిన తరగతుల పరిస్థితులని పరిశీలించేందుకు రాష్ట్రపతి ఒక కమీషనుని నియమించి ఆ కమీషన్ సూచించిన సిఫార్సులపై తగు చర్యలు తీసుకునేందుకు పార్లమెంట్ కి సూచించడం జరుగుతుందన్నారు. అయితే జనవరి 1 ,1979 న జనతా ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన రెండవ వెనకబడిన తరగతుల కమీషన్ ఛైర్మన్ గా బీపీ మండల్ భాధ్యతలు చేపట్టడం జరిగిందని, కమీషన్ డిసెంబర్ 31, 1980 న ప్రభుత్వానికి తన నివేదికని సమర్పించినట్లు ఆయన వివరించారు. కానీ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోవడంతో మండల్ సిఫార్సుల అమలు మూలకి పడిందని, మళ్లీ 1990 ఆగష్ట్ 7 న తొలి భారత బ్రాహ్మణేతర ప్రధాని వీపీ సింగ్ తమ జనతాదళ్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలోపెట్టిన ప్రకారం మాన్యవర్ కాన్షీరామ్ డిల్లీ లోని బోట్స్ క్లబ్ వద్ద 40 రోజుల పాటు మండల్ అమలు కరో యా కుర్సీ ఖాళీ కరో అంటూ చేసిన ఆందోళన వల్ల పార్లమెంట్ లో మండల్ కమీషన్ సూచించిన 40 సిఫార్సులల్లో కనీసం ఒక్కటైన బీసీలకు కేంధ్ర ప్రభుత్వ ఉద్యోగాలల్లో 27శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించారని ఆయన తెలిపారు. అయితే ఒకసారి బీసీల గురించి పట్టించుకున్న క్రమంలో ఆ ప్రభుత్వానికి మద్దతిస్తున్నవారంతా తమ మద్దతు ఉప సంహరించు కోవడంతో ప్రభుత్వం పడి పోయిందని ఈ క్రమంలోనే మండల్ కమీషన్ సిఫార్సులని పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఏటా ఆగష్ట్ 7 న మండల్ డే జరుపు కుంటున్నారని తెలిపారు.