మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు

wetherసకాలంలో రుతుపవనాలు ఉంటాయంటున్న వాతావరణ శాఖ

విశాఖపట్టణం,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  మండుతున్న ఎండలతో తెలుగు రాష్టాల్రు విలవిల్లాడుతున్నాయి. రోజురోజుకు ఎండలు పెరుగుతూ ఉష్ణోగ్రతలు పెంచుతున్నాయి. నిప్పు కణికల్లాంటి ఉష్ణతీవ్రతతో రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు ఉడికిపోతున్నాయి. ఎండల వేడిమికి వడగాడ్పులూ తోడవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో అనేకచోట్ల వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. ఉపాధి కూలీలు ఎక్కువగా చనిపోతున్నట్లు సమచారం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అలాగే అనంతలోనూ తీవ్రంగానే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో సాధారణంకంటే నాలుగైదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో మరో 24 గంటలు వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ

తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలు, తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాయలసీమ, తెలంగాణల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, కోస్తాంధ్రలో 34 నుంచి 38 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అనంతపురంలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. నిజామాబాద్‌, రామగుండం, కర్నూలుల్లో 43, హైదరాబాద్‌లో 41, తిరుపతి, నందిగామ, రెంటచింతలల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు విదర్భ నుంచి కొమరిన్‌ ప్రాంతం వరకు తెలంగాణ , కర్ణాటక, తమిళనాడుల విూదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణల్లో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు గాని, తేలికపాటి వర్షం గాని కురవవచ్చని ఐఎండీ సోమవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

విశాఖ ఏజెన్సీలో సోమవారం పలుచోట్ల వడగాళ్ల వాన కురిసింది. పాడేరు మండలం గుత్తులపుట్టు పరిసర ప్రాంతాల్లో సుమారు 3 గంటల పాటు వర్షం కురిసింది. ఎక్కడచూసినా కుప్పలు తెప్పలుగా వడగళ్లు కురవడంతో స్థానికులు వర్షాన్ని ఆస్వాదించారు. ధారకొండ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి అంతర్రాష్ట్ర రహదారిపై చెట్టు కూలడంతో కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే చెట్టును గిరిజనులు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. సీలేరు ప్రాంతంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మామిడితో పాటు పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇదిలావుంటే ఈ యేడు సకాలంలోనే రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతు పవనాల వల్ల భారీ వానలు కురవనున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఖరీఫ్‌ పంటకు కావాల్సినంత వానలు కురిసి పుష్కలంగా పంటలు పండతాయని లెక్కలేశారు. నైరుతి రుతుపవనాల వల్ల సాధారణం, లేక అంత కంటే ఎక్కువ వానలు కురిసే వీలున్నందున 2016-17 ఖరీఫ్‌లో పంటలకు డోకా ఉండదని వాతావరణ శాస్త్రవేత్తలు లెక్కగట్టారు. ఏప్రిల్‌, మే, జూన్‌లలో ఎప్పటి లాగే ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు కురుస్తాయి. జూలై, సెప్టంబర్లలో సాధారణం కంటే భారీ వానలు కురవనున్నాయి. గత జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఎండలు దంచి పారేసినందున వచ్చే జూన్‌ నుంచి వానలు మొదలవుతాయని అంచనా.  2014లో ఐదు శాతం వానలు ఎక్కువగా కురిసినప్పటికీ వాటిలో ఎక్కువ అకాల వర్షాలు కావటంతో పంటకు ప్రయోజనం లేకుండా పోయింది. గత ఏడాది ఖరీఫ్‌లో తొలి ముంగార్లలో సాధారణం కంటే యాభై శాతం వాన ఎక్కువగా కురిసింది. పర్యవసానంగా మే, జూన్‌లో వర్ష పాతం తగ్గిపోయింది. ఖరీఫ్‌ తర్వాత రబీ కూడా దెబ్బతినటం తెలిసిందే. ఆ సారి తొలి ముంగార్లు సాధారణ వర్షపాతం దాఖలు కాగలదని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్ని బట్టి లెక్క గట్టారు. జులై, సెప్టంబరు మాసాల్లో తగినంత వానలు కురిసే అవకాశాలున్నందున పంటలకు డోకా ఉండబోదని మదింపు వేశారు. రబీలో వానలు సరిగ్గా కురవక పోతే ఖరీఫ్‌ పంటకు నైరుతి రుతు పవనాల వల్ల వానలు బాగా పడతాయని గత దాఖలాలు చెబుతున్నాయి.  వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంటే నైరుతి రుతుపవనాల వల్ల సాధారణం కంటే ఎక్కువ వానలు కురిసే వీలుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వేసవి జల్లులు సాధారణంగా దాఖలైతే నైరుతి రుతు పవనాల వల్ల మామూలు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.

తాజావార్తలు