మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
మఖ్తల్ జూలై 10 (జనంసాక్షి)
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాగనూరు మండల కేంద్రంలోని హై స్కూల్ నుండి సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా కోకన్వీనర్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు భరత్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా 10, 11, 12 తేదీలలో టోకెన్ సమ్మెలో భాగంగా స్కూళ్లలో వంట బందు పెట్టి కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మధ్యాహ్న భోజన కార్మికుల మెనూ ఛార్జీలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని జీవో నెంబర్ 8 ప్రకారం పెరిగిన వేతనానికి ఏరియర్స్ తో కలిపి ఇవ్వాలని కోడిగుడ్డుకు అదనపు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2022 మార్చి లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన 3000 రూపాయల వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యం, పిఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికుల కనీస వేతనం 18000 ల రూపాయలు ఇవ్వాలని అన్నారు. పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ సవరించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు. ఈ ధర్నాకు మద్దతుగా సిపిఎం పార్టీ కార్యదర్శి గొల్ల నరేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోవిందు, సాగెన్నోల మారెప్ప, మాగనూరు, కృష్ణ మండలాల మధ్యాహ్న భోజన యూనియన్ నాయకులు ప్రమీల, లక్ష్మీ దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.