మహానాడు వేదిక ఖరారు

సిద్దార్ధ కాలేజీ మైదానంలోనే నిర్వహణ
పరిశీలించిన మంత్రి కళా వెంకట్రావు
విజయవాడ,మే8(జ‌నం సాక్షి):  ఈనెల 27వతేదీ నుంచి మూడు రోజులపాటు విజయవాడలోని కానూరులో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగనుంది. మహానాడు నిర్వహణకు ఆయా ప్రాంతాలను పరిశీలించి నప్పటికీ కానూరులోని సిద్ధార్థ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో మహానాడు నిర్వహణకు ఏర్పాట్లను ప్రారంభించారు. రాష్ట్ర మంత్రి కిమిడి కళా వెంకట్రావు మంగళవారం ఉదయం సిద్ధార్థ కాలేజీ ప్రాంగణాన్ని సందర్శించించి పరిశీలించారు. తెలుగుదేశం పార్టీ పండుగలా నిర్వహించే మహానాడును విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆయా కమిటీలు ఏర్పాటుకానున్నాయి. ఘనంగా నిర్వహించేం దుకు 14 కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించామని కళా వెంకటరావు తెలిపారు. ఈనెల 27 నుంచి 29 వరకూ మూడు రోజులపాటు జరగనున్న మహానాడు ఏర్పాట్లపై సవిూక్ష నిర్వహించారు. ఆహ్వానాలు, ప్రతినిధుల నమోదు, ప్రాంగణ ఏర్పాటు, నగర అలంకరణ, రవాణా, వాహనాల పార్కింగ్‌, ఆర్థిక వనరులు, విూడియా సంబంధాలు, సాంస్కృతిక తదితర కమిటీలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఒక్కో కమిటీకి కన్వీనర్‌, కో-కన్వీనర్‌, సభ్యులను ఎంపిక చేస్తామని చెప్పారు. గత మహానాడులో మాట్లాడేందుకు అవకాశంరాక నిరుత్సాహానికి గురైన వారందరికీ ఈసారి ప్రాధాన్యం కల్పిస్తామని హావిూ ఇచ్చారు. కమిటీ
ప్రతినిధులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తారని తెలిపారు. మహానాడుకు హాజరైన వారందరికీ దుర్గాదేవి దర్శనం కల్పించాలన్న కొందరు నేతల ప్రతిపాదనను పరిశీలిస్తామని హావిూ ఇచ్చారు. ఇక్కడే ఉన్న  తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ మాట్లాడుతూ… ఎన్నికల ఏడాదైనందున రెండు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యే వీలున్నందున తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిద్దార్ధ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణాన్ని రెండు రాష్ట్రాల అధ్యక్షులు మంగళవారం ఉదయం పరిశీలించారు.

తాజావార్తలు