మహిళలను నగ్న ప్రదర్శన చేసిన నిందితులను ఉరి తీయాలి-ఏవైఎస్ రాష్ట్ర నాయకులు పుల్ల మల్లయ్య డిమాండ్.
చిట్యాల జులై 22 (జనంసాక్షి)దేశ వ్యాప్తంగా సభ్య సమాజం తలదించుకునేలా ముగ్గురు మహిళలను అత్యాచారం చేసి, అనంతరం నగ్న ప్రదర్శన చేసిన నిందితులను కేంద్ర ప్రభుత్వం ఉరి తీయాలని అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు పుల్ల మల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈమేరకు శనివారం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహాం ముందు ప్లే కార్డులు పట్టుకుని నినాదాలు చేసి,నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రాష్ట్ర నాయకులు మల్లయ్య జిల్లా నాయకులు గుర్రపు రాజేందర్, జన్నే యుగేందర్ లు మాట్లాడుతూ మహిళలపై రోజు రోజుకు జరుగుతున్న సంఘటనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోక పోవడం వల్ల మణిపూర్ లో సంఘటన జరిగిందన్నారు . కుకీలు గిరిజన కులానికి చెందిన ముగ్గురు మహిళలను నగ్న ప్రదర్శన చేసి హత్య చేయడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. దుండగులు చేస్తున్న సంఘటనను చూసి అడ్డుకున్నా తమ్ముడుని, తండ్రిని చంపిన దుండగులు వారి ఇండ్లు తగులబెట్టి మహిళలను రెండు కిలోమీటర్ల దూరం వరకు నగ్నంగా నడిపి హత్య చేయడం సిగ్గుచేటన్నారు .ఈ ప్రభుత్వాలు అగ్రవర్ణ కులానికి చెందిన వారిపై జరిగితే వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకునే వారని తెలిపారు. మన భారత దేశం లో అగ్రవర్ణ కులానికి ఒక న్యాయం, ఎస్సీ. ఎస్టీ, బిసి, మైనార్టీ కులాలకు ఒక న్యాయమా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే నిందితులను ఉరి తీయాలని, మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల సంస్కృత కార్యదర్శి పుల్ల ప్రతాప్, మండల నాయకులు గుర్రం రాజమౌళి, కనకం తిరుపతి, గురుకుంట్ల కిరణ్, గుర్రం తిరుపతి, కట్కూరి రాజేందర్ ,గడ్డం కొంరయ్య తదితరులు పాల్గొన్నారు.