మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలా
టిడిపి నేతలపై విరుచుకుపడ్డ వైకాపా
విజయవాడ,మే10(జనం సాక్షి):వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. మహిళా ఎమ్మెల్యే అన్న కనీస గౌరవం లేకుండా రోజాపై అనుచిత వాఖ్యలు చేసిన బుద్దా వెంకన్న సంస్కార హీనుడని మండిపడ్డారు. గుడిలో కొబ్బరి చిప్పలు దొంగిలించే చరిత్ర బుద్దా వెంకన్నది అని ఎద్దేవా చేశారు. గన్నవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు జోగి రమేశ్, సామినేని ఉదయభాను, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రారావు, పేర్ని నాని మాట్లాడుతూ.. ఓ మహిళా ఎమ్మెల్యేను అగౌరవపరిచేలా బుద్దా వెంకన్న మాట్లాడడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
బజారులో ఛీకొట్టిన వారిని చంద్రబాబు పార్టీలోకి ఆహ్వనించి ఎమ్మెల్సీలు, విప్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. మహిళలను గౌరవించాలంటూ చంద్రబాబు ర్యాలీలు చేస్తూనే తన ఎమ్మెల్సీల చేత ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేయిన్నారని ఆరోపించారు. గుడిని, గుడిలోని లింగాన్ని మింగే వ్యక్తి బుద్దా వెంకన్న అని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు ఒక్క రోజు దీక్ష? కోసం 30 కోట్ల రూపాయలు
ఖర్చు చేశారు. కానీ మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నార’ని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు.