మాచర్ల, పిగడుగురాళ్లలో పత్తి కొనుగోళ్లు
గుంటూరు,నవంబర్7(జనంసాక్షి): జిల్లాలో 11 మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి పుల్లారావు అన్నారు. ప్రస్తుతం గుంటూరుతో పాటు నడికుడి, మాచర్ల, పిడుగురాళ్ల మార్కెట్‌యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. బహిరంగ మార్కెట్లో పత్తి ధర క్వింటా రూ.3,500 నుంచి రూ.3,800 వరకు మాత్రమే ఉందని, అందుకే సీసీఐను రంగంలోకి దించి పత్తి కొనుగోళ్లు చేయిస్తున్నామని తెలిపారు. పత్తి రైతులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని మంత్రి ప్రత్తిపాటి స్పష్టం చేశారు.రైతులు తక్కువ ధరకు పత్తిని అమ్ముకోవద్దని, కనీస గిట్టుబాటు ధర రూ.4,320లు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. నేరుగా యార్డులకు తరలించి గిట్టుబాటు ధరకు అమ్ముకోవాలని, అయితే తేమ శాతం 8 వరకు ఉంటే నిర్ణయించిన ధర పడుతుందన్నారు. అంతకంటే ఎక్కువ తేమ శాతం ఉంటే క్వింటాకు రూ.43.20లు వంతున ధర తగ్గుతుందని వెల్లడించారు. పత్తి కొనుగోళ్లలో దళారుల ప్రమేయం ఉండకూడదని, సిబ్బంది ఎవరైనా దళారులు, మధ్యవర్తులతో కుమ్మక్కైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు పత్తిని అమ్ముకున్న 48 గంటల్లోనే నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. గుంటూరు మిర్చియార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారభించారు. పత్తి కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు కేవలం ఈ-క్రాప్ బుకింగ్ ద్వారానే నిర్వహిస్తున్నామన్నారు.