మీ నోటులో చిప్ ఉందా?

636176632780252295న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త రెండు వేల నోటు విడుదల చేయగానే ఆ నోటుపై ఎన్నో ఊహాగానాలు, పుకార్లు హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు అసత్య వార్తలను ప్రచారం చేశారు. కొత్త రెండు వేల నోటుపై బాగా చక్కర్లు కొట్టిన అంశం చిప్. కొత్త నోటులో చిప్ అమర్చారని, అందులోని జీపీఎస్ సిస్టమ్ ద్వారా దొంగ నోటుకు, అసలు నోటుకు తేడా కనిపెట్టవచ్చని వార్తలొచ్చాయి. ఆ తర్వాత కొత్త నోటులో చిప్ ఏమీ లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో ఈ రూమర్లకు తెరపడింది. ఇప్పుడు మళ్లీ ఈ చిప్ వ్యవహారం మరోసారి చర్చకొచ్చింది. ఐటీ శాఖ దాడుల్లో కోట్ల రూపాయల కొత్త నోట్లు పట్టుబడటమే ఇందుకు కారణం.
అసలు కొత్త నోటులో చిప్ అమర్చడంపై సాధ్యాసాధ్యాలను ఓ నేషనల్ ఛానల్ విశ్లేషించింది. టెలికామ్ ఎక్స్‌పర్ట్‌ సమక్షంలో నోటులో చిప్ అమర్చి ఓ అరుదైన ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఫలితంపై ఆ టెలికామ్ నిపుణుడు మాట్లాడారు. చిప్‌ల్లో రెండు రకాలు ఉంటాయని తెలిపారు. ఒకటి యాక్టివ్ చిప్, రెండు పాసివ్ చిప్. యాక్టివ్ చిప్ కొత్త నోటులో ప్రవేశపెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
కారు లాకింగ్ సిస్టమ్‌లో ఈ చిప్‌ను వినియోగిస్తారని, బ్యాటరీ సహాయంతోనే ఈ చిప్ పనిచేస్తుందని చెప్పారు. పాసివ్ చిప్ నోట్లలో అమర్చేందుకు అవకాశముందని, కానీ అది సత్ఫలితాలను ఇస్తుందని కచ్చితంగా చెప్పలేమని చెప్పారు. పాసివ్ చిప్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ తరంగాల ఆధారంగా పనిచేస్తుందని, చిప్ పనిచేయాలంటే పవర్ కూడా అవసరమని తెలిపారు. కొత్త నోటు లాంటి కాగితంలో ఆ చిప్ అమర్చితే 10, 15 సెంటీమీటర్ల వరకూ మాత్రమే దాని ప్రభావం ఉంటుందని చెప్పారు. అంటే మొత్తంగా చిప్ ప్రవేశపెడుతున్నారని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తమని ఈ ప్రయోగంతో తేలిపోయింది.

తాజావార్తలు