ముందుగానే నైరుతి ఆగమనం
అంచనావేస్తోన్న వాతావరణ శాఖ
విశాఖపట్నం,మే14(జనం సాక్షి): తాజా వాతావరణ పరిణామాలు గమనిస్తుంటే ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు భారతదేశంలోకి నాలుగురోజులు ముందే ప్రవేశిస్తాయని స్కైమెట్ వాతావరణ సంస్థ మరోసారి తాజాగా వెల్లడించింది. ఈ నెల చివరివారంలో అంటే 28 లేదా 29 తేదీల్లో కేరళను తాకుతాయని తెలిపింది. వాస్తవానికి జూన్ 1న కేరళను తాకాల్సి ఉన్నా ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు అంచనా వేస్తోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో జూన్ తొలి వారంలో నైరుతి పవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని నిపుణలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే హిందూ మహా సముద్రంలోని భూ మధ్య రేఖా ప్రాంతానికి రుతు పవన గాలులు వీస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం విశ్రాంత డైరక్టర్ రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. నాలుగు రోజులు ఆలస్యమవుతాయన్న వాగరీస్ సంస్థ అంచనాతో ఆయన ఏకీభవించలేదు. పశ్చిమ ఆటంకాల ప్రభావంతో ఉత్తరాధిలో ఎండలకు బదులు వర్షాలు కురుస్తుండటం, అక్కడ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కావడంతో ఉత్తర భారతదేశంలోకి పడమటి గాలులు ప్రవేశించేందుకు అనుకూలంగా లేదన్నది వాగరీస్ వాదన. అందువల్లే భూ మధ్య రేఖా ప్రాంతంలో నైరుతి రుతు పవనాల బలపడలేవని చెబుతోంది. అయితే ఇప్పటికే ఉత్తరాధిలోకి రుతు పవన గాలులు ప్రవేశించాయని రాళ్లపల్లి చెబుతున్నారు. హిందూ మహా సముద్రంలో నైరుతి పవనాల కదలికలు మొదలయ్యాయన్నారు. అనుకున్న సమయం కంటే ముందే వస్తాయని చెప్పారు. ఈ నెల 15 నాటికి నైరుతి అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా పయనిస్తుందని పేర్కొంది. మరోవైపు రాయలసీమ నుండి దక్షిణ
తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. వీటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. రాయలసీమలో పలు చోట్ల 42 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఆదివారం ఉత్తర కోస్తాలోని శ్రీకాకు ళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. ఆగేయ బంగాళాఖాతం నుండి వస్తున్న తేమ గాలుల ప్రభావంతో ఏర్పడిన క్యుములో నింబస్ మేఘాల కారణంగా వర్షాలు పడ్డాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం అక్కడక్కడా వర్షాలు పడతాయని, మిగిలిన చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు.
———————