మున్నూరు కాపుల ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదు.. – స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సిగ్గుచేటు..కాంగ్రెస్

నిర్మల్ బ్యూరో, జులై14,జనంసాక్షి,, మున్నూరు కాపుల ఆత్మ గౌరవాన్ని మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాదాల వద్ద తాకట్టు పెట్టడం సిగ్గు చేటని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దశరథ రాజేశ్వర్, మాజీ కౌన్సిలర్ పొడెల్లి గణేష్ లు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంచి రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన అప్పాల గణేష్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారని విమర్శించారు. తన భూములు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. నిర్మల్ నియోజకవర్గంలో రెండవ ఓటు బ్యాంకు కలిగిన మున్నూరు కాపుల ప్రతిష్టను దెబ్బతీయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ గా పని చేసిన సమయంలో రాజకీయంగా దెబ్బ తీసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెంతకు చేరడం సిగ్గు చేటని అన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న మున్నూరు కాపులను మంత్రి ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్టీలో ఉన్న నాయకులు ఆత్మ విమర్శన చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ బొల్లోజు నర్సయ్య, నాయకులు నాందేడపు చిన్ను, పూదరి అరవింద్, పడాల శ్రీనివాస్, ఈటెల శ్రీనివాస్, గడ్డింటి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు