మైనార్టీలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కేసీఆర్

మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి జూలై 13 (జనం సాక్షి) మైనార్టీలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ విస్మరించారని, 12 శాతం రిజర్వేషన్లపై సమాధానం చెప్పాలని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కెసిఆర్ మైనార్టీలను మోసం చేశారని ఆరోపించారు. వక్స్ బోర్డుకు జ్యూడిషయల్ అధికారాలు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రంలో లక్షలాది ఎకరాల వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతున్నట్లు తెలిపారు. వక్స్ ఆస్తులపై వచ్చే ఆదాయాన్ని నిరుపేదల ముస్లింలకు ఖర్చు చేయడం లేదని విమర్శించారు. జిల్లా కేంద్రంలో ముస్లింల షాదీఖానా నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తున్నట్లు, కాని ఈద్గా వద్ద కాకుండా ముస్లింలకు అందుబాటులో ఉన్న ఉర్దూ ఘర్ స్థలంలో నిర్మించాలని కోరారు. ముస్లింలకు సంబంధించి ఎక్కువగా రాత్రిపూట వివాహ, శుభాకార్యాలు జరుగుతాయని పట్టణానికి దూరంగా ఉన్న ఈద్గా వద్ద నిర్మిస్తే ఏ విధంగా ఉపయోగపడుతుందన్నారు. షాది ఖానాను పట్టణం నడిబొడ్డున నిర్మించాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరించడం సరికాదన్నారు. రాష్ట్రంలో రైతులకు 8 గంటల నాణ్యమైన విద్యుత్ ఎక్కడ అందుతుందో చూపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యుత్ నుంచి వచ్చే కమిషన్లు ఎక్కడిపోతాయేనని బాధతో బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉండి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ కు రైతులే తగిన బుద్ధిచెబుతారని ఆయన హెచ్చరించారు. సమావేశంలో మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పట్టణ మైనార్టీ విభాగం అధ్యక్షుడు అజ్మత్ అలీ, నాయకులు జహీర్, సిరాజ్, షబ్బీర్ అలీ, మొయిజ్, ఫక్రు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు