యాత్రికుల పరిస్థితిపై చంద్రబాబు ఆరా

– ఏపీ భవన్‌ అధికారులతో మాట్లాడిన సీఎం
– క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావాలని ఆదేశం
అమరావతి, మే9(జ‌నం సాక్షి) : బద్రీనాథ్‌ యాత్రకు వెళ్లి మంచు తుఫానులో చిక్కుకున్న ఉత్తరాంధ్ర యాత్రికుల క్షేమ సమాచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన 66 మంది చార్‌ధామ్‌ యాత్రికులు మంగళవారం బద్రీనాథ్‌లో చిక్కుకుపోయారు. మరోవైపు శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మి నేతృత్వంలో ఉత్తరాఖండ్‌లో ఉపాధి పనుల పరిశీలనకు వెళ్లిన 39 మందితో కూడిన జడ్పీటీసీలు, అధికారుల బృందం కూడా అక్కడ చిక్కుకుపోయింది. ఈ నెల 3న అక్కడికి వెళ్లిన వీరంతా మంచు వర్షం కారణంగా వీరంతా సీతాపురిలో చిక్కకుపోయినట్లు సమాచారం అందింది. దీంతో ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. తమ వారి క్షేమ సమాచారంపై కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. ఈ సంగతి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ భవన్‌ అధికారులతో మాట్లాడారు. యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని వారిని ఆదేశించారు. ఇదిఉంటే ఏపీ భవన్‌ నుంచి యాత్రికుల సమాచారాన్ని బుధవారం అధికారులు ఎప్పటికప్పుడు సేకరించారు. ఎంపీ రాంమోహన్‌నాయుడు భద్రీనాథ్‌లో చిక్కుకున్న యాత్రికులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్షణమే వారికి స్వస్థలానికి చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్పీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్ష్మీ నేతృత్వంలోని ఉత్తరాఖండ్‌ వెళ్లిన జడ్పీటీసీలు, అధికారుల బృందం ఉత్తరాఖండ్‌ నుంచి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు ఏపీ భవన్‌ అధికారులు తెలిపారు.
—————————-

తాజావార్తలు