రక్తదానం ప్రాణదానంతో సమానం: టిటిడి జెఇవో

తిరుపతి,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని టిటిడి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్‌ పేర్కొన్నారు. తిరుపతి కేంద్రీయ వైద్యశాల రక్తనిధి కేంద్రంలో విష్ణుసారధి సొసైటీ, తితిదే రవాణాశాఖ ఒప్పంద డ్రైవర్లు స్వచ్ఛందంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదాన శిబిరాలను, సేకరణను తితిదే ఆధ్వర్యంలో పెంచడానికి చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. తితిదేకు చెందిన విద్యాసంస్థలు, వివిధ శాఖల్లో రక్తదానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న రక్తనిధి కేంద్రాల సామర్థ్యం పెంచి అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ప్రత్యేక రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్యక్రమంలో రవాణాశాఖ జీఎం శేషారెడ్డి, ముఖ్య వైద్యాధికారి నాగేశ్వరరావు, డాక్టర్‌ ఆర్‌వీఎస్‌ మురళీధర్‌, రక్తనిధి కేంద్రం ప్రత్యేక అధికారి డాక్టర్‌ కుసుమకుమారి, డాక్టర్‌ పద్మజ, డాక్టర్‌ కాంతిశ్రీ, నర్సింగ్‌ సిబ్బంది నవనీతమ్మ, సరస్వతి, సూర్య తదితరులు రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి రక్తాన్ని సేకరించారు.

తాజావార్తలు