రత్నాపూర్ ఐకేపీ సెంటర్ లో అక్రమాలు.. రైతుల ఆందోళన..!
జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రత్నాపూర్ ఐకేపీ సెంటర్ లో రభీ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రైతులు శనివారం మంథని – పెద్దపల్లి రోడ్డు పైకి వచ్చి ధర్నా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఐకేపీ సెంటర్ వారు ఇచ్చిన ట్రక్ షీట్ లో వున్న డబ్బుల కంటే తమ బ్యాంక్ ఖాతా లో జమ అయిన మొత్తం ప్రతి ఒక్క రైతుకు పది వేల నుండి పదిహేను వేల రూపాయలు తక్కువ జమ కావడం జరిగిందని అన్నారు. ఐకెపి సెంటర్ నిర్వాహకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ఇలా రైతులను మోసం చేశారని వారు ఆరోపించారు. ప్రభుత్వం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ వెంటనే స్పందించి ఈ తతంగం పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక, రైతులకు నష్ట పోయిన డబ్బులను తిరిగి ఖాతాలో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా, ఆందోళనలో మట్ట రాజ్ కుమార్ , భోగి ప్రకాష్, కండె పోచం, కొడారి సది, జక్కుల భూమయ్య, సాగర్ల శ్రీకాంత్, కనవేన సది తో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.