రథసప్తమికి ముస్తాబైన అరసవిల్లి
నేడు ప్రత్యేక అభిషేకాలు..భారీగా తరలిరానున్న భక్తులు
శ్రీకాకుళం,జనవరి23(జనంసాక్షి): శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో అతి ప్రాచీనమైన సూర్య దేవాలయంలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేక ఆరాధనలు,పూజలు ఉంటాయి. రథసప్తమి రోజు స్వామి దర్వనం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. దేశంలోని ఉన్న అతి కొద్ది సూర్య దేవాలయాల్లో ఇదొకటి. రథసప్తమి సందర్భంగా అర్ధరాత్రి నుంచీ ఈ ఆలయంలో పూజా కార్యక్రమాలు, స్వామికి క్షీరాభిషేకాలూ మొదలవుతాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచీ భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి సూర్యనారాయణుడిని దర్శించుకుంటారు. అరసవిల్లి శ్రీకాకుళం పట్టణాన్ని ఆనుకొని ఉంటుంది. బుధవారం రథసప్తమి కావడంతో ప్రసిద్ధ అరసవెల్లి దేవాలయం రథసప్తమికి సిద్ధమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఆలయ సిబ్బంది వసతి ఏర్పాట్లు చేపట్టింది. అరసవెల్లి రాష్ట్రంలో సూర్య దేవాలయం ఉన్న పవిత్ర ప్రాంతం. ప్రజల ప్రత్యక్ష దైవం… అనంత జీవరాశికి మూలకారకుడైన ఆదిత్యుని జన్మతిథి రథసప్తమికి అరసవెల్లి సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యింది. సప్తమి ఘడియలు సవిూపంచే సమయంలో జరిగే పంచామృత అభిషేకంతో మొదలవుతోంది అరసవెల్లి వైభోగం. అరుదైన స్వామి నిజరూప దర్శనం రథసప్తమి రోజున భక్తులకు కలుగుతుంది. ఉదయభానుడి ప్రభాత కిరణాలు విగ్రహ పాదాలను తాకే అపురూప క్షణం అద్భుతం. రథసప్తమి రోజు స్వామి వారికి వివిధ రకాల పుష్పాలంకరణ సేవ నిర్వహించనున్నారు. రథసప్తమి సందర్భంగా ఆలయ పరిసరాలతో పాటు ఇంద్రపుష్కరిని చుట్టూ భక్తుల కోసం ఉచిత క్యూలైన్లు ఏర్పాటు చేశారు.ఇప్పటికే భక్తుల కోసం లక్ష లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. స్థానికులే కాకుండా తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆహారంతో పాటు మంచి నీరు అందించే విధంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టినట్లు ఆలయ ఈవో శ్యామలదేవి తెలిపారు. కోణార్క్ తర్వాత అరసవెల్లిలోనే సూర్యభగవానుడి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని దేవేంద్రుడు నిర్మించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. స్వామివారి జన్మతిథి రోజు ఛాయాఉషాపద్మిని సమేతంగా భాస్కరుడు భక్తులకు దర్శనమిస్తాడు.