రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవయవస్థపై దాడి

కాంగ్రెస్‌ పార్టీ ఫ్రస్టేషన్‌లో ఉంది. ఆ పార్టీకి ఎటూ తోచడం లేదు. దేశంలో నేరం ఘోరం జరిగిందన్న రీతిలో ప్రవర్తిస్తోంది. గతచరిత్రను మరచిపోయి, దేశంలో న్యాయవ్యవస్థ ప్రమాదంలో పడిందన్న బిల్డప్‌ ఇస్తోంది. ఇలా అయినా కొంత ఇమేజ్‌ సాధించాలన్న తపనలో ఉంది. ప్రధానంగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా విషయంలో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయం దారుణం కాక మరోటి కాదు. అభిశంసన ఎప్పుడు పెట్టాలో..ఎలాంటి సందర్బాల్లో పెట్టాలో కూడా తెలియకుండా చేస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్‌ తదితర విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానం చూస్తుంటే కాంగ్రెస్‌కు రాజకీయం తప్ప మరో ప్రయోజనం లేదని అర్థం అవుతోంది. జస్టిస్‌ లోయా విషయంలో తీర్పు కావచ్చు..ఎస్సీ,ఎస్టీ ఆట్రాసిటీ కేసు వియంలో కావచ్చు.. లేదా ఇతర సుప్రీం జడ్జిలు చీప్‌ జస్టిస్‌పై అసంతృప్తిగా ఉన్నారన్న విషయాలు కావచ్చు… కానీ ఇవన్నీ సహేతుక కారణాలు కావు. సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ను అభిశంసిడం అన్నది ఆషామాషీ వ్యవహారంగా కాంగ్రెస్‌ తీసుకున్నట్లుగా ఉంది.
సీజేఐ అభిశంసనకు గురికావడం.. ఇంతవరకూ భారత్‌లో చోటుచేసుకోలేదు. అందుకే శుక్రవారం నాటి పనిణామాలు భారత చరిత్రలో ఇదో కనీవినీ ఎరుగనివిగా చూడాలి. దేశ  అత్యున్నత న్యాయ పీఠాధిపతిపై విపక్ష పార్టీలు సమరానికి దిగడం అన్నది ఇదే తొలిసారి అవుతుంది.  భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రకు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్‌ సహా ఏడు పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ మేరకు ఆయన అభిశంసనకు 64 మంది సంతకాలతో కూడిన ఒక నోటీసును ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి అందజేశాయి. అత్యున్నత పదవిలో ఉంటూ సీజేఐ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించాయి. ఐదు రకాల ‘దుష్పవ్రర్తన’ ఆధారంగా ఈ చర్యకు దిగినట్లు పేర్కొన్నాయి. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసును విచారిస్తున్న జడ్జి బి.హెచ్‌.లోయా మరణంపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్‌ దీపక్‌ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసిన మరుసటిరోజే ఈ పరిణామం చోటుచేసుకుంది. అభిశంసన నోటీసుపై కాంగ్రెస్‌, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్‌పీ, బీఎస్‌పీ, ముస్లిం లీగ్‌ సభ్యులు సంతకాలు చేశారు. అభిశంసన తీర్మానం పెట్టాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, కపిల్‌ సిబాల్‌, రణదీప్‌ సుర్జేవాలా, సీపీఐకి చెందిన డి.రాజా, ఎన్‌సీపీకి చెందిన వందనా చవాన్‌ తదితరులు చర్చించారు. అభిశంసన తీర్మానం కోసం తామిచ్చిన నోటీసును ఆమోదిస్తే.. సీజేఐ తన విధులకు దూరంగా ఉండాల్సి ఉంటుందని కపిల్‌ సిబాల్‌ అన్నారు. ఇలాంటి రోజు రావాలని మేమెప్పుడూ కోరుకోలేదు. న్యాయమూర్తులు అత్యున్నత నిబద్ధతా ప్రమాణాలను పాటించాలి. న్యాయవ్యవస్థలో ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం అత్యుత్తమమైంది. న్యాయవ్యవస్థ పరంగా ఆయన సమానులందరిలో ఒక్కడైనప్పటికీ పాలనాపరంగా ఆయన చేతుల్లో విస్తృత అధికారాలున్నాయి. అయితే జస్టిస్‌ దీపక్‌ మిశ్ర ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొన్ని కేసుల్లో ఆయన వ్యవహరించిన తీరు, పాలనాంశాల్లో తీసుకున్న నిర్ణయాలతో సరికొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల్లో అంతర్గతంగా నెలకొన్న స్పర్థలు బహిరంగ అసమ్మతికి దారితీశాయని అనేక ఉదాహరణలు ఇచ్చారు. కొంతకాలంగా సుప్రీంకోర్టు పరిపాలన వ్యవహారాలు సవ్యంగా సాగడంలేదని, అవాంఛనీయ పరిణామాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యాన్ని ఎదుర్కొని న్యాయ వ్యవస్థ స్వతంత్రతను కాపాడే విషయంలో ప్రధాన న్యాయమూర్తి నిర్ణయాత్మకంగా వ్యవహరించడం లేదని ఇద్దరు సీనియర్‌ న్యాయమూర్తులు ఇటీవల ఆయనకు రాసిన లేఖలు స్పష్టంచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం
ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం పనితీరును బట్టి న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పు పొంచి ఉందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీనియర్‌ న్యాయమూర్తులే విశ్వసిస్తున్నప్పుడు జాతి యావత్తు మిన్నకుండిపోవాలా? అన్న ప్రశ్నను కాంగ్రెస్‌ వేస్తోంది.  ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని రక్షించే న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడటానికి రాజ్యాంగంలో ఇందుకున్న ఏకైక పరిష్కార మార్గం అభిశంసన తీర్మానం అని కాంగ్రెస్‌ నేతలు సమర్థించుకున్నారు. అయితే ఇది అసలు చర్చకు వస్తుందా? అన్నది ఇపుడు కీలకంగా మారింది. నిబంధనల ప్రకారం విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ ఛైర్మన్‌ మొదట పరిశీలించాలి. జడ్జి దుష్పవ్రర్తన లేదా అసమర్థత అనే రెండు అంశాలే అభిశంసన చేయడానికి ప్రధానం. ఛైర్మన్‌ గనక విపక్ష తీర్మానాన్ని అడ్మిట్‌ చేస్తే నిపుణులైన ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఆయనే ఏర్పాటుచేస్తారు. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి, ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఓ న్యాయ కోవిదుడు ఆ కమిటీలో సభ్యులుగా ఉండాలి. ఆ కమిటీ అన్ని అంశాలనూ పరిశీలించి అభియోగాలు నమోదుచేస్తుంది. ఆ అభియోగాల కాపీని సంబంధిత జడ్జికి కూడా పంపుతారు. తరవాత నివేదికను రాజ్యసభ చైర్మన్‌కు నివేదిస్తారు. ఆ జడ్జి దోషి కాడని, ఆయనపై మోపిన అభియోగాలు నిజం కావని ఆ కమిటీ తేల్చితే ఇక అభిశంసన దాదాపుగా ఉండదు.  అలా కాకుండా ఆ అభియోగాలు సరైనవని భావిస్తే పక్రియ ముందుకెళుతుంది. మొత్తంగా ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌ తీరు దేశ ప్రయోజనాలు విస్మరించేదిగా, సొంత రాజకీయా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చేదిలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ చర్యకారణంగా దేశ న్యాయవ్యవస్థపై అనుమానాలు పెరిగేలా చేశాయి. వ్యవస్థను భ్రష్టుపట్టించేలా మన చర్యలు ఉండకూడదు. మొత్తంగా ఈ వ్యవహారం ఎటు పోతుందన్నది వేచి చూడాలి.