రాజ్ భవన్, అసెంబ్లీ నిర్మాణానికి 500కోట్లు !
అమరావతి : నవ్యాంధ్ర రాజధానిలో రాజ్‌భవన్, శాసనసభ తదితర భవనాల నిర్మాణానికి రూ.500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వచ్చినట్లు సమాచారం. ఆ భవనాల డిజైన్లు, ఇతర వివరాలతో పూర్తిస్థాయి నివేదిక పంపితే వాటిని పరిశీలించి, రూ.500 కోట్లు విడుదల చేస్తామని ఆ లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ జాబితాలో రాజ్‌భవన్, అసెంబ్లీతోపాటు మరో ఒకటి రెండు భవనాలు ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు రాష్ట్ర రాజధాని నగర నిర్మాణంపై సీఆర్‌డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు విజయవాడలో సమీక్షించనున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల క్వార్టర్లు, ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయ సముదాయాల నిర్మాణంపై శుక్రవారం నాటి భేటీలో ఒక దిశానిర్దేశం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.