రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌కేంద్రాల ముట్టడి
హైదరాబాద్: విద్యుత్ సరఫరాకు రాష్ట్రవ్యాప్తంగా అంతరాయం ఏర్పడటం, సాగు తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడటంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో అనేక జిల్లాల్లో ప్రజలు విద్యుత్ స్టేషన్లను ముట్టడించారు. సిబ్బందిని నిర్భందించారు. రాస్తారోకోలు చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్, మిర్‌దొడ్డి మండలాల్లో విద్యుత్ అధికారులను నిర్భందించారు. నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి, మిర్యాలగూడెం మండలాల్లో సబ్‌స్టేషన్‌కు తాళం వేశారు. అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై రాస్తారోకో చేశారు. తిరుమలగిరి మండలంలోని మామిడాల గ్రామంలో విద్యుత్తు బిల్లుల వసూళ్ల కోసం శనివారం గ్రామానికి వచ్చిన విద్యుత్తు అధికారులను గ్రామస్థులు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్భందించారు. సరఫరా సరిగా చేయకుండా వసూళ్లకు రావడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజులుగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులననఱు ఎదుర్కోంటున్నట్లు పేర్కోన్నారు. ఖమ్మం జిల్లా కైకొండాయిగూడెంలో సిబ్బందిని నిర్భందించారు. వరంగల్ జిల్లా రాయపర్తి వర్దన్నపేట, బచ్చన్నపేటల్లో సబ్‌స్టేషన్లను ముట్టడించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని కిష్టాజిగూడెం గ్రామపంచాయతీలో విద్యుత్‌కోతలను నిరసిస్తూ ఇద్దరు లైన్‌మెన్లను గ్రామస్థులు నిర్భందించారు. విద్యుత్తు కోతలను ఎత్తివేయాలని, సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సరఫరా చేస్తామని ఎఈ హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్షకుర్తి గ్రామంలో విద్యుత్తు కోతలను నిరసిస్తూ చేనేత కార్మికులు శనివారం రిలే నిరాహారదీక్షలను చేపట్టారు. విద్యుత్తు కోతతోమరమగ్గాల పనులు సాగక ఉపాధి కోల్పోతున్నామని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. మరమగ్గాలకు 24గంటల సరఫరా ప్రకటనలకే పరిమితమైందని కేవలం రెండు గంటల విద్యుత్తు సరాఫరాతో పూట గడవడం కష్టంగా మారిందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో అమలవుతున్న ప్యాకేజీలను ఇక్కడ కూడా వర్తింపజేసి ఆదుకోవాలని చేనేత కార్మికులు కోరారు.