రీడిజైన్‌ పేరుతో భారీ అవినీతి

6
– టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌

హైదరాబాద్‌,ఆగస్టు 17(జనంసాక్షి):ప్రాజెక్టుల రీ డిజైన్‌తో ప్రభుత్వంలోని పెద్దలు  వేలకోట్ల దోపిడీకి పాల్పడ్డారని కాంగ్రెస్‌ ఆరోపించింది. అలాగే మిగులు బడ్జెట్‌ను లోటు బడ్జెట్‌గా మార్చారని పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ పార్టీ బుధవారం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. ప్రాజెక్టుల అంచనాలను భారీగా పెంచి అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. రూ.83 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడుతామంటున్నారని, ప్రాజెక్టు నిర్మాణ వాస్తవ వ్యయం రూ.30 వేల కోట్లు అయితే దానిని రూ.83 వేల కోట్లకు పెంచారని ఆయన అన్నారు. లక్షల కోట్ల ప్రాజెక్టులకు డీపీఆర్‌ లేకపోతే ఎలానని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై తెరాస వివక్ష చూపుతోందని ఆరోపించారు. తెలంగాణలో జల ప్రాజెక్టులపై వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పేందుకే వాస్తవ జలదృశ్యం ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన వాస్తవ జలదృశ్యంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తొందని ఉత్తమ్‌ ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అని చెప్పి సీఎం కాకి లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం అనేక అబద్దాలను వాస్తవాలుగా చెప్పారని.. వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెప్పేందుకు వాస్తవ జలదృశ్యం ఏర్పాటుచేసినట్లు చెప్పారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందంటే కారణం విభజన సమయంలో చేసిన కేటాయింపులేనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఎంతమంది అడ్డుకోవాలని చూసినా తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీయేనని గుర్తుచేశారు. పార్లమెంటులో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రత్యేక రాష్టాన్న్రి సోనియా ప్రతిపాదించారన్నారు. ఏఐసీసీ నేతలు దిగ్విజయ్‌ సింగ్‌, కుంతియా,భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ, చిన్నారెడ్డి, శ్రవణ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.   టీకాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజెంటేషన్‌ తప్పుల తడకని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ బూటకపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చి, సాగునీటి వ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నారని ఆరోపించారు.  ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. నిజాలు నిగ్గుతేల్చేందుకే తాము ప్రజెంటేషన్‌ ఇస్తున్నామన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రణాళికను రూపొందించింది కాంగ్రెస్‌ పార్టీయేనని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 33 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, 52 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చింది కాంగ్రెస్‌ పార్టీయేనని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టులపై కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని

మండిపడ్డారు. ప్రాణహిత డిజైన్‌ మార్చి తెలంగాణ భవిష్యత్ను తాకట్టుపెట్టారు. జలం పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. అసెంబ్లీ వేదికగా కేసీఆర్‌ కాకిలెక్కలు చెప్పారు. కోటి ఎకరాలకు నీరు అందిస్తామని కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు చెప్పారు. లక్షా యాభైవేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి దోపిడీకి తెరతీశారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. రూ.83 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కడుతామంటున్నారని, ప్రాజెక్టు నిర్మాణ వాస్తవ వ్యయం రూ.30 వేల కోట్లు అయితే దానిని రూ.83 వేల కోట్లకు పెంచారని ఆయన అన్నారు. లక్షల కోట్ల ప్రాజెక్టులకు డీపీఆర్‌ లేకపోతే ఎలానని ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌లో భారీగా అవినీతి జరుగుతోందని అన్నారు. కోట్లు దండుకోవడానికే ప్రాజెక్టుల అంచనాలు పెంచుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. పనులు ప్రారంభించకముందే మూడు సార్లు అంచనాలు పెంచారని, ఎవడబ్బ సొమ్మని అంచనాలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లన్నీ బోగసేనని, కాంట్రాక్టర్లకు కోట్లు కుమ్మరిస్తున్నారని ఉత్తమ్‌ విమర్శించారు. దీనిపై ప్రజలను చైఔతన్యం చేస్తామని అన్నారు.