రుణప్రణాళికలో లోపించిన చిత్తశుద్ది
విజయవాడ,జూన్20(జనంసాక్షి): ఖరీఫ్ ముంచుకొస్తున్నా ముందస్తు ఏర్పాట్లు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని వ్యవసాయ కార్మిక సంగం ఆరోపిస్తోంది. రైతులు సాగు చేయాలంటే వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పెట్టుబడులు, సలహాలు అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానిది కాగా ఆ దిశగా పెద్దగా చర్యలు లేకుండా పోయాయని అన్నారు. సమయానికి ఏవో మాటలు చెప్పి ఆ పూట గడిస్తే చాలు అన్నట్లు సర్కారు వ్యవహారం సాగుతోందన్నారు. రుతుపవనాల రాకతో అన్నదాతలు ఏరువాకకు సిద్ధం కాగా ప్రభుత్వం వారికి అందించాల్సిన ఉత్పాదకాల విషయంలోనూ విూనమేషాలు లెక్కించడం అన్యాయమన్నారు. దేశంలోకెల్ల ఎపిలో అత్యధికంగా 92 శాతానికిపైగా రైతులు రుణగ్రస్తులని ఇటీవలే నేషనల్ శాంపిల్ సర్వే వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో కొంత ముందుగానే ప్రవేశించి తమ ప్రభావం చూపుతున్నాయి. విపత్తులొచ్చిన సందర్భాల్లో ప్రకృతిపై నెపం వేస్తున్న సర్కారు వాతావరణ సానుకూలత నెలకొన్నా తన వంతు బాధ్యత నెరవేర్చడంపై పట్టీపట్టనట్లుండటం దారుణం. సంస్థాగత అప్పులు పుట్టనందున ప్రైవేటు వడ్డీ వ్యాపారులను రైతులు ఆశ్రయించి అప్పుల ఊబిలో కూరుకొని చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ అనుభవాలు ఉండి కూడా ఈసారన్నా రైతులకు బ్యాంకుల నుంచి, ప్రభుత్వం నుంచి పెట్టుబడులు సమకూర్చాలన్న ధ్యాస సర్కారుకు ఏకోశానా లేదని విమర్శించింది. రుణ ప్రణాళిక ప్రతిపాదనలు చూసినా, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వని వైనం చూసినా, రుణమాఫీ రెండో కిస్తీ విడుదలపై విన్యాసాలు చూసినా అర్థమవుతుంది.
2016-17 రాష్ట్ర రుణ ప్రణాళిక రూ.1,65,538 కోట్లు కాగా అందులో వ్యవసాయానికి రూ.83 వేల కోట్లు ప్రతిపాదించామని, గతం కంటే ఇది చాలా ఎక్కువని చెప్పారు. పంట రుణాలే రూ.60 వేల కోట్లని వల్లెవేశారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు గత ఏడాది రూ.65 వేల కోట్లు ప్రతిపాదిస్తే ఈ తడవ రూ.75 వేల కోట్లకు పెంచామని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) గతేడాది కార్యక్రమాలపై ప్రచురించిన సవిూక్ష పుస్తకంలో కౌలు రైతులు ఎంతగా దగా పడ్డారో కళ్లకు కట్టిందన్నారు. మొత్తంగా 16.25 లక్షల కౌలు రైతులకు పంట రుణాలివ్వాలని గత సంవత్సరం లక్ష్యంగా పెట్టుకోగా లక్ష మందికే అప్పులిచ్చారు. కౌలు రైతులు రుణాలు ఎగ్గొట్టినా బాంకులకు భద్రత కోసం క్రెడిట్ గ్యారంటీ ఫండ్‌ను నెలకొల్పాలంటూ చేసిన సిఫారసులను సర్కారు పట్టించుకోనందున టార్గెట్లకనుగుణరగా రుణాలివ్వలేకపోయామని బ్యాంకులు వెల్లడించాయి. ఎనభై శాతానికి పైబడి భూమిని కౌలు చేస్తున్న వాస్తవ సాగుదార్లకు పెట్టుబడులు సమకూర్చకుండా ప్రాథమికరంగం, వ్యవసాయ వృద్ధిపై ఎంత వాగాడంబరం ప్రదర్శించినా రైతులకు ఒరిగేదేవిూ లేదు. బ్యాంకులు అప్పులివ్వక, ప్రభుత్వం సహాయం చేయకపోతే రైతులకు పెట్టుబడులెలా సమకూరతాయి? సేద్యం ఎలా చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకున్న సమయంలో ప్రభుత్వ పెట్టుబడులు పెంచాలి. కానీ చంద్రబాబు సర్కారు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంఅంటూ రాష్టాన్ని కార్పొరేటర్లకు అప్పగిస్తోంది. ప్రపంచబ్యాంక్ ఆదేశాలతో సమ్మిళిత వృద్ధి పేరుచెప్పి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలను నెలకొల్పి పది లక్షల మంది రైతులను కార్పొరేట్ల చేతుల్లో పెడుతూ పెద్ద ఎత్తున కంపెనీ, కాంట్రాక్టు సేద్యాన్ని ప్రవేశ పెడుతోందని రైతు సంఘం నేతలు ఆందోళన చెందుతున్నారు. సర్కారు తక్షణం ఖరీఫ్ సాగుకు అన్ని ఏర్పాట్లూ చేసి ప్రైవేటీకరణ విధానాలు విడనాడాలని కోరుతున్నారు.