రుయాలో కీచక పర్వం

– కళాశాల విద్యార్థిని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే
– విచారణకు గవర్నర్‌ ఆదేశించారు.
– నేడు ఘటనపై గవర్నర్‌కు నివేదిక అందజేస్తాం
– ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రమణయ్య
తిరుపతి, మే5(జ‌నం సాక్షి ) : తిరుపతిలోని రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలో కీచకపర్వం పై ఎస్వీ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రమణయ్య స్పందించారు. ఈమేరకు ఆయన శనివారం ఓ ఛానెల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ.. లైంగిక వైధింపులపై ఎస్వీ మెడికల్‌ కళాశాల పీడియాట్రిక్‌ పీజీ ఫైనలియర్‌ విద్యార్థిని ఫిర్యాదు చేసిన మాట వాస్తవేనన్నారు. తనను ముగ్గురు ప్రొఫెసర్లు లైంగికంగా వేధిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలంటూ గవర్నర్‌కు ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై స్పందించిన గవర్నర్‌… విచారణ
చేపట్టాల్సిందిగా హెల్త్‌ యూనివర్సిటీ వీసీకి ఆదేశాలు జారీ చేశారన్నారు. దీంతో వర్సిటీ వీసీ ఆదేశాల మేరకు విచారణ చేశామని ఆయన తెలిపారు. ఆదివారం ఈ ఘటనపై నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
కాగా, పీడియాట్రిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ రవికుమార్‌, ప్రొఫెసర్‌ కిరీటి, ప్రొఫెసర్‌ శశికుమార్‌లు తన పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని బాధితురాలు గవర్నర్‌కు పంపిన లేఖలో పేర్కొంది. ప్రతిరోజు లైంగిక
వేధింపులకు గురిచేస్తున్నారని, అభ్యంతరకర పదాలతో హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రాక్టికల్‌ పరీక్షలు వారి చేతుల్లో ఉన్నాయని వేధిస్తున్నారని ఆరోపించింది. ఓపాపకు తల్లినైన తాను వారి బాధలు భరించలేక ఓ సారి ఆత్మహత్యకు యత్నించగా, తన భర్త కాపాడినట్లు వివరించింది. పలుమార్లు ఎస్వీ మెడికల్‌ కళాశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయింది. దీనిపై స్పందించిన గవర్నర్‌… లైంగిక వేధింపులపై విచారణ చేపట్టాలని హెల్త్‌ వర్సిటీ వీసీని ఆదేశించారు. రుయాఆస్పత్రి అనస్థీషియా విభాగాధిపతి జమున, జనరల్‌ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ జయా భాస్కర్‌, రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సిద్ధానాయక్‌లతో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ నాలుగు రోజులుగా అత్యంత గోప్యంగా విచారణ చేపట్టింది.
————————————–

 

తాజావార్తలు