రూ.140కే కందిపప్పు అమ్మాలి
గుంటూరు, : నిత్యవసర సరుకుల్లో ఒకటైన కందిపప్పు ధరని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని డాల్ మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారస్థులకు జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు, హోల్‌సేల్ డీలర్లు కేజీ కందిపప్పుని రూ. 140కి మాత్రమే విక్రయించాలని స్పష్టం చేశారు. అలానే రిటైలర్లు రూ. 3 మార్జిన్‌తో రూ. 143కు విక్రయించుకొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు తమ మిల్లులు, షాపుల వద్ద తప్పక బ్యానర్లు ఏ ర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుబజార్లలో కూడా డాల్ మిల్లర్ల అసోసియేషన్లు ఒక కౌంటర్ ఏర్పాటు చేసి కందిపప్పుని విక్రయించాలన్నారు. కందిపప్పు ధర తగ్గింపు విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటం, జాయింట్ కలెక్టర్ నేరుగా రంగంలోకి దిగడంతో శనివారం నుంచే తగ్గించిన ధర అమలులోకి తీసుకురానున్నట్లు పౌరసరఫరాల వర్గాలు చెబుతున్నాయి.
కొన్ని నెలల క్రితం కేజీ కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో రూ. 67 మాత్రమే ఉన్నది. అంచెలంచెలుగా ధర పెరుగుతూ నేడు రూ. 210కి చేరుకొన్నది. ధరని తగ్గించేందుకు ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా కేజీ రూ. 50కే పంపిణీ చేస్తున్నప్పటికీ మార్కెట్‌పై ప్రభావం చూపలేకపోయింది. దీనికి ప్రధాన కారణం రేషన్ షాపుల్లో పంపిణీ చేస్తున్న కందిపప్పు నాణ్యతగా ఉండటం లేదన్న ప్రచారం విస్త్రృతంగా జరగడమే. దాంతో కార్డుదారులు చాలామంది కందిపప్పు ప్రతి నెలా రేషన్‌షాపు నుంచి తీసుకెళ్లడం లేదు. ఇలా మి గిలిపోతున్న కందిపప్పుని కొంతమంది డీలర్లు నల్లబజారుకు తరలిం చి సొమ్ము చేసుకొంటున్నారు. ధర దిగి వస్తుందిలేనని అందరూ ఆశలు పెట్టుకోగా గత వారంలో కేజీ ధర రూ. 210కి చేరుకొన్నది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. మిల్లర్లు, డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ధిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని జేసీ శ్రీధర్‌ని ఆదేశించింది. దాంతో ఆయన శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పా టు చేసి ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు. శనివారం నుంచే జిల్లా వ్యాప్తంగా తగ్గించిన కందిపప్పు ధర అమలు కావాలని స్పష్టం చేశా రు. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుండాలని, ఎవరు అధిక ధరకు విక్రయిస్తున్నా కఠి న చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో వ్యాపారం నిర్వహిస్తున్న బె స్ట్ ప్రైస్, రిలయన్స్, మోర్, స్పెన్సర్స్ వంటి మాల్స్‌లో కూడా కేజీ కందిపప్పు రూ. 143కే విక్రయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయకపోతే సంబంధిత వ్యాపారస్తుల డాల్ విక్రయ లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు.