రూ.1981 కోట్లునాబార్డు రుణం ద్వారా తొలి విడత నిధులు అందజేసిన కేంద్రం
పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు తొలి విడత రుణం కింద రూ.1981 కోట్లు అందజేసింది. ఈమేరకు ఒక చెక్కును కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం నాడిక్కడ చెక్కు అందజేశారు. అంతకుముందు ఇండియా హాబిటేట్ సెంటర్‌లో నాబార్డు, నీటి పారుదల మంత్రిత్వ శాఖల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రులు, విజరు గోయల్, సంజీవ్ కె బళ్యాన్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర జలవనరుల మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరావు, నానూబారు బి వానానీ, గిరిష్ మహాజన్, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శశి కుమార్, నాబార్డు ఛైర్మన్ హర్ష కుమార్ బన్వాల్, కేంద్ర జలనవరుల, ఆర్థిక, వ్యవసాయ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్, నాబార్డు ఉన్నతాధికారులు, ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. నాబార్డు దీర్ఘ కాలిక నీటి పారుదల నిధి (ఎల్‌టిఐఎఫ్) కింద నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.35,322 కోట్లు మంజూరు చేసింది. గుజరాత్‌కు రూ. 3,611 కోట్లు, మహారాష్ట్రకు రూ.7242 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి రూ.2,981 కోట్లు, కేంద్ర వాటా కింద(నేషనల్ వాటర్ డవలప్‌మెంట్ ఏజెన్సీ) రూ21,488 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ. 5,200 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. సోమవారం మరో రూ. 3,700 కోట్లు విడుదల చేసింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని నేషనల్ వాటర్ డవలప్‌మెంట్ ఏజెన్సీకి కేంద్ర వాటాల కింద రూ.499.91 కోట్లు, పోలవరానికి రూ.1981 కోట్లు, గుజరాత్‌కి రూ.463 కోట్లు, మహారాష్ట్రకి రూ.756.09 కోట్లు విడుదల చేసింది ఆ మొత్తాలను చెక్కుల రూపంలో అందజేశారు.
2019 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు దేశంలో పెద్ద ప్రాజెక్టుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2018 నాటికి మేజర్ డ్యాం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని, 2019 నాటికి పోలవరం పూర్తవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు పోలవరానికి అయిన ఖర్చు కింద కేంద్ర ప్రభుత్వం రూ.1981 కోట్లిచ్చిందన్నారు. ప్రాజెక్టును ఫాస్ట్ ట్రాక్‌లో పెట్టామని, ఇప్పటి వరకు 11సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని తెలిపారు. ప్రతి సోమవారం పోలవరం దినంగా నిర్ణయించి సమీక్షిస్తున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నిధులివ్వడం సంతోషంగా ఉందన్నారు. నదుల అనుసంధానం కోసం వాజ్‌పేయి హయాంలో టాస్క్‌పోర్స్‌ను ఏర్పాటు చేశారన్నారు. అయితే దాన్ని యూపీఏ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వచ్చిందన్నారు. వ్యవసాయ రంగంలో బీమాపై ప్రధాని నరేంద్ర మోడీ దష్టిసారించారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ప్రపంచంలోనే అతిత్వరగా పెద్ద ప్రాజెక్టు పూర్తి చేసిన రికార్డును సొంతం చేసుకుంటామన్నారు. పోలవరం పూర్తయితే రాష్ట్రంలో కరువును అధిగమించొచ్చని చెప్పారు. ఈ నెల 30న పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభిస్తామని, అత్యంత ప్రధానమైన స్పిల్ వే, డయాఫ్రం వాల్ నిర్మాణం డిజైన్లకు కేంద్ర జల సంఘం నుండి అనుమతులు లభించాయని చెప్పారు. రాష్ట్ర విభజన తరువాత నీటి కోసం తెలంగాణ, ఇతర రాష్ట్రాలతో తగాదాలు పడుతున్నామని గుర్తు చేశారు. ”దేశ ప్రయోజనాల కోసం పోలవరం నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పది వేల కోట్లు ఖర్చు చేశాం. పోలవరం ఎత్తు పెంచలేదు. పాత డిజైన్‌కు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోంది. ఎన్జీటీ అనుమతులతో సంబంధం లేదు. రాష్ట్రంలోని పెద్ద మనుషులు ప్రాజెక్టు రాకూడదని అన్ని విధాలా ప్రయత్నాలు చేశారు. పట్టిసీమను వ్యతిరేకించారు. కానీ అనుకున్న సమయానికి పూర్తి చేశాం. రైతులను రెచ్చగొట్టారు. వీటిని ఎక్కడికక్కడే సమర్థవంతంగా తిప్పికొట్టాం” అని విలేకరుల ప్రశ్నకు బదులిచ్చారు.